• పెరిగిన సాగు ఖర్చులు
• పతనమైన రొయ్య ధరలు
• వేధిస్తోన్న నాణ్యమైన రొయ్య పిల్లల కొరత
• ఒకేసారి 25 శాతం ఎగబాకిన దాణా ధరలు
రొయ్యలసాగు సంక్షోభంలో పడింది. రొయ్యల సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం ఒక కారణం అయితే, రొయ్యల ధరలు పతనం కావడం మరో కారణంగా చెప్పవచ్చు. రొయ్యల ఎగుమతులు, ధరలు ఆశాజనకంగా ఉంటే ఆక్వాసాగు సిరులు కురిపిస్తుంది. ఏ మాత్రం తేడా వచ్చినా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా తలెత్తిన సంక్షోభం మరోసారి ఆక్వా రైతును నష్టాల్లోకి నెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం ఓ కారణం అయితే, పెరిగిన సాగు ఖర్చులు మరో కారణంగా చెప్పుకోవచ్చు. సంక్షోభ సమయంలో రొయ్యల రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, మద్దతు ధర తగ్గించి రైతుల వెన్ను విరిచింది. దాణా ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవడంతోపాటు, షరతులు లేకుండా రాయితీ ధరకు విద్యుత్ సరఫరా చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో రొయ్యలసాగు మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో 3.9 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇందులో 1.90 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. మరో 2 లక్షల ఎకరాల్లో చేపల సాగు జరుగుతోంది. ఇందుకుగాను మొత్తం 63334 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం మీద 1.35 లక్షల మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నట్టు ఈ క్రాపింగ్ ద్వారా తెలుస్తోంది. వీరిలో 2.5 ఎకరాలలోపు సాగు చేస్తున్న వారు 95277 మంది కాగా, 2.5 నుంచి 5 ఎకరాల్లోపు సాగు చేస్తున్నవారు 22,358 మంది ఉన్నారు. ఇక 5 నుంచి 10 ఎకరాలు సాగు చేస్తున్నవారు 11809 మంది ఉన్నారు. పదెకరాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న రైతులు 6398 మంది ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఏటా రాష్ట్రంలో 18 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తుల ద్వారా రూ.66 వేల కోట్ల ఆదాయం లభిస్తోంది. మనదేశం నుంచి జరిగే ఆక్వా ఎగుమతుల్లో 40 శాతం ఏపీ నుంచే జరుగుతున్నాయి. రొయ్యలు ఎక్కువగా మన రాష్ట్రం నుంచి చైనా, అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇటీవల ఈక్వెడార్, ఇండోనేషియా నుంచి పోటీ ఎక్కువైంది. దీంతో మన రొయ్యలకు విదేశాల్లో డిమాండ్ తగ్గింది. ధరలు పతనం అయ్యాయి. వ్యాపారులకు కూడా ధరలు తగ్గించారు. దీంతో ఆక్వాసాగు మరోసారి సంక్షోభంలో పడింది.
• సాగు ఖర్చులు భారం :
రొయ్యల సాగు ఖర్చులు వేగంగా పెరిగాయి. దీనికి తోడు ధరలు పతనం కావడంతో రొయ్యల సాగు రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు సాధికార కమిటీ వేశామని, ధరలను స్థిరీకరించామని ప్రభుత్వం చెబుతున్నా రొయ్యల ధరల పతనం మాత్రం ఆగడం లేదు. దాణా ధర గడచిన 2 నెలల కాలంలోనే కిలోకు రూ.80 నుంచి రూ.108కి పెరిగింది. సోయా ధరలు పెరగడంతో దాణా ధరలు పెంచాల్సి వచ్చిందని తయారీదారులు చెబుతున్నారు. ఇక కరెంటు ఖర్చు కిలో రొయ్యల సాగుకు రూ.20 నుంచి రూ.40కి పెరిగింది. మరోవైపు నాణ్యమైన వనామీ రొయ్య పిల్లలు అందుబాటులో లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి ధరల పతనం తోడైంది. గడచిన ఆరు నెలల కాలంలోనే రొయ్యల ధరలు దారుణంగా పడిపోయాయి. అయినా ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవడం లేదు. 2022 ఏప్రిల్ మాసంలో 30 కౌంట్ కిలో రొయ్యల ధర రూ.600 పలకగా నేడు రూ.400లకు పడిపోయింది. 60 కౌంట్ రూ.400 నుంచి రూ.250కు, 80 కౌంట్ రూ.310 నుంచి రూ.220కు పడిపోయాయి.
• విద్యుత్ రాయితీ కొందరికే....
అధికారంలోకి వస్తే ఆక్వా రైతులను ఆదుకుంటామని అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది అమలు చేశారు. ఆ తరవాత షరతులు విధించారు. పదెకరాలలోపు ఆక్వా జోన్ లో సాగు చేయడంతోపాటు, అన్నీ అనుమతులు ఉన్న రైతులకు యూనిట్ విద్యుత్ రూ. 1.50కే అందిస్తున్నారు. పదెకరాలు దాటినా, ఆక్వాజోన్ లో లేకపోయినా, అన్నీ అనుతులు లేకపోయినా అలాంటి రైతులు యూనిట్ విద్యుత్ కు రూ.3.85 చెల్లించాల్సి వస్తోంది. దీంతో విద్యుత్ ఖర్చులు రొయ్య రైతుకు భారంగా మారాయి. ప్రభుత్వ రాయితీలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ క్రాపింగ్ చేయించుకోవాలి. ఇంత వరకు ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే ఆక్వా రైతులు విద్యుత్ రాయితీ పొందాలంటే ఆక్వా జోన్ పరిధిలో ఉండాలి. జోన్ లను ప్రకటించేది ప్రభుత్వమే. ఇక ఆక్వా రైతులు తాము సాగుచేస్తున్న భూముల రికార్డులు, వన్ బీ అడంగల్, లీజ్ అగ్రిమెంట్ కాపీ, వీఆర్వో నుంచి పొందిన సర్టిఫికెట్ ఆఫ్ కల్చర్ లతో ఆర్బీకేల్లోని మత్స్య సహాయకులు లేదా మత్స్య అభివృద్ధి అధికారిని సంప్రదించాలి. వివరాలను నమోదు చేయించుకుని విద్యుత్ రాయితీకి అర్హత పొందాలి. ఇవన్నీ చేయించుకోవడం రైతుకు తలకుమించిన భారంగా మారింది. ఆక్వాజోన్ పరిధిలో లేకుంటే ఇక ఆ రైతుకు ఎలాంటి రాయితీలు అందడం లేదు.
• గిట్టుబాటు కాని మద్దతు ధర
రొయ్యల రైతులను ఆదుకునేందుకు ఇటీవల ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. 100 కౌంటు కిలో రొయ్యల సాగుకు రూ.270 ఖర్చవుతుంటే, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతుధర కిలోకు రూ.210గా ఉంది. అంటే రైతులు కిలోకు రూ.60 నష్టపోవాల్సి వస్తోంది. తగ్గించిన ధరకు కూడా వ్యాపారులు చురుగ్గా కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 100 కౌంట్ రొయ్యలకు ప్రభుత్వం మొదట రూ.240 మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో మద్దతు ధరను తాజాగా కిలోకు రూ.210కి తగ్గించారు. దీంతో రైతులు మరింత నష్టపోవాల్సి వస్తోంది. గత ఎన్నికల్లో జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. ఆక్వాసాగు చేసే ప్రతి మండలంలో శీతల గిడ్డంగులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంత వరకు నెరవేరలేదు. మార్కెట్లో ధర లేకపోయినా శీతల గిడ్డంగులు లేక రైతులు వెంటనే రొయ్యలు అమ్ముకోవాల్సి రావడం తీవ్ర నష్టాలకు దారితీస్తోంది. దాణా ధరల నియంత్రణకు ఇటీవల సీఎం జగన్ రెడ్డి, తయారీదారులతో సమావేశం నిర్వహించారు. ఏదో కంటి తుడుపుగా దాణా ధర కిలోకు రూ.2.88 తగ్గించినట్టు ప్రకటించారు. ఆచరణలో అది కూడా అమలు కావడం లేదు.
• సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే....
ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆక్వాసాగు సంక్షోభంలో పడుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రొయ్యల సాగు ఎగుమతులపై ఆధారపడి ఉంది. మొత్తం రొయ్యల సాగులో 90 శాతం ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా చైనా, అమెరికా, ఐరాపా దేశాలకు ప్రాసెస్ చేసిన రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. ఏపీలో 27 రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు రొయ్యల ఎగుమతులు చేస్తున్నాయి. ఇటీవల ఈక్వెడార్, ఇండోనేషియా నుంచి పోటీ అధికమైంది. మన రైతులకు నాణ్యమైన వనామీ రొయ్యపిల్లలు లభ్యం కావడం లేదు. ఈ విషయంలో ఈక్వెడార్, ఇండోనేషియా చాలా ముందున్నాయి. అందుకే వారు మనకంటే తక్కువ ధరకే రొయ్యలు ఎగుమతి చేస్తున్నారు. వారి నుంచి మన రైతులు పోటీని ఎదుర్కోలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన రొయ్య పిల్లలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి రైతులకు రాయితీ ధరలకు అందించాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రాయితీ ధరకు విద్యుత్ సరఫరా చేయాలి. దాణా ధరలు సాధ్యమైనంత వరకు అదుపు చేయాలి. అప్పుడే మన రొయ్య రైతులు పోటీని తట్టుకుని నిలబడగలుగుతారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com