అమరావతి, (జనస్వరం) : ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు మరోసారి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఎవరైతే గతంలో క్రియాశీలక సభ్యులుగా చేరలేకపోయామని బాధపడుతున్నారో వాళ్లు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఈ మేరకు వీడియో సందేశమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ... “ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వచ్చింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరికొద్ది రోజులు పొడిగించమని మన నాయకత్వం నుంచి పార్టీ కార్యాలయానికి సందేశాలు, ఫోన్లు వస్తున్నాయి. వారి కోరిక మేరకు మరో 8 రోజులు పొడించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకునే వారు, రెన్యువల్ చేయించుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
సభ్యత్వాలు 5 లక్షలు నమోదు కావాలి
సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం దాదాపు 3500 మంది వాలంటీర్లు అద్భుతంగా పనిచేశారు. వాళ్లందరికీ ఈ రోజు రాత్రి నుంచే లింక్స్ ఓపెన్ అవుతాయి. కొత్తగా వాలంటీర్లుగా సేవలు అందించాలనుకునే వారు... మీ పూర్తి వివరాలతో పాటు ఏ నియోజకవర్గంలో పనిచేయాలనుకుంటున్నారో వంటి సమాచారాన్ని కేంద్ర కార్యాలయానికి అందజేయండి. అధ్యక్షుడి కోరిక మేరకు మనందరం కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో 5 లక్షల సభ్యత్వాలు నమోదు చేయాలి. దాని కోసం అహర్నిశలు మనం కృషి చేయాలి. ఈ వారం రోజులు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సమయం కేటాయించండి. మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఇన్సూరెన్స్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తెలపండి. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లండి. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని చేయలేదు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి.
షణ్ముఖ వ్యూహం గడపగడపకూ చేరాలి
ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి జనసైనికులు, వీర మహిళలు చాలా బాగా కృషి చేశారు. వాళ్లకు పార్టీ తరఫున, శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరు హర్షించే విధంగా నడుచుకున్నారు. మీరు కట్టిన ప్రతి బ్యానర్, ఎత్తిన ప్రతి జెండా పార్టీకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచింది. పార్టీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఎటువంటి ప్రయాణం చేయబోతున్నాం? అంథకారంలో ఉన్న మన రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకురాబోతున్నాం వంటి అంశాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహాన్ని వివరించారు. దానిని ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి చేర్చేలా కృషి చేయాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. రాబోయే రోజుల్లో విజయం సాధించేది జనసేన పార్టీయే. ఒక్క సంవత్సరం మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధించడం తథ్యం’’ అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com