ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థాయి బియ్యం ఎగుమతిదారుగా థాయ్‌లాండ్ దేశానికి 30 ఏళ్లుగా ఉన్న పేరును భారతదేశం 2012లోనే చెరిపేసి, ఆ స్థానాన్ని భారతదేశం ఆక్రమించింది. ఆ తరవాత ఏడాది నుంచి రెండు, మూడు స్థానాలను వియత్నాం, థాయ్‌లాండ్ దేశాలు తరచూ పంచుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరంగా 2020-21 సీజన్ కు సంబంధించి భారత్ నుంచి 70,000 టన్నుల నూకల దిగుమతికి వియత్నాం ఒప్పందం కుదుర్చుకొంది. అసలు 2016-17 నుంచే వియత్నాం నాసిరకం బియ్యాన్ని భారతదేశం నుంచి కొనుగోలు చేసి పశువుల దాణాకు, బీరు తయారీకీ ఉపయోగిస్తోంది. ఈ ఏడాది వియత్నాం నుంచి మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా బియ్యం దిగుమతి చేసుకునే చైనా దాదాపు మూడు దశాబ్దాల తరవాత మొదటిసారి 2020 సంవత్సరానికి గాను భారతదేశం నుండి బియ్యాన్ని కొనుగోలు చేసింది. ఇది 2021లో కూడా కొనుగోళ్లు కొనసాగించనుంది. చైనాకు లక్ష టన్నుల నూకల ఎగుమతికి ఒప్పందాలు కుదిరాయి. చైనా సాధారణంగా భారతీయ బియ్యం నాణ్యతకు ఎప్పుడు వంకలు పెడుతూ పాకిస్థాన్, థాయ్‌లాండ్, వియత్నాం, మయన్మార్‌ల నుంచి దిగుమతి చేసుకొంటూ ఉండేది. కానీ కరోనా కాలంలో ఈ ఏడాది చైనాలో బియ్యానికి బాగా కొరత ఏర్పడటంతో మన బియ్యాన్ని కొనక తప్పనీ పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు పోయిన ఏడాది జులైలో యాంగ్ట్సే నదికి తీవ్రస్థాయి వరదలు రావడంతో చైనాలో కోటీ 30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి ఒక అంచనా. దానికితోడు దరిమిలా మిడతల దండు దాడి వచ్చిపడింది. మరోవైపు చైనాలో ఆహార వృథా కూడా రోజురోజుకీ ఎక్కువవుతూ వస్తోంది. ఇది చాలదన్నట్లు 3.7 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ సతరించుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఆహార భద్రత కోసం భారతదేశం నుంచి బియ్యాన్ని కొనక తప్పడం లేదు.
వాతావరణ పరిస్థితి మరియు కరోనా ఆంక్షలు :
ఇతర దేశాల్లో వాతావరణ పరిస్థితులతో పోలిస్తే, భారతదేశంలో పంట సాగుకు సరిపడ విస్తారమైన వర్షాలు కురిసి వరి పంట విరగపండినందువల్ల, గత ఏడాది నవంబరు నాటికే 70 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయగలిగింది. పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో అకాల వర్షాలు, వరదల వల్ల వరి పంట దెబ్బతిని బియ్యం ధరలు పెరిగిపోవడంతో భారత్ లక్షన్నర టన్నుల బియ్యం ఎగుమతి చేసి అక్కడి ధరల స్థిరీకరణకు తోడ్పడింది. ఇది భారతదేశం - బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం ప్రకారం జరిగిన ఎగుమతి. భారత్, సింగపూర్‌ల నుంచి మరో రెండున్నర లక్షల టన్నుల బియ్యం కొనాలని నిర్ణయించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, బియ్యం దిగుమతులపై సుంకాన్ని 62.5 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. దీంతో బంగ్లాదేశ్ కు ఎగుమతులు పెంచడానికి భారతీయ సరఫరాదారులు సిద్ధమవుతున్నారు. 2020-21 సీజను ముగిసేసరికి భారత్ నుంచి మొత్తం బియ్యం ఎగుమతులు కోటి టన్నులకు చేరతాయని, అఖిల భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం (ఐరియా) అధ్యక్షుడు బి.కృష్ణారావు గారి ప్రకారం ఒక అంచనా. ఈ కోటి టన్నులూ ఎగుమతి కూడా సాధారణ బియ్యమే తప్ప బాస్మతి రకం కాదు. సీజను ముగిసేనాటికి బాస్మతి, సాధారణ బియ్యం ఎగుమతులు కలిసి మొత్తంకోటి 40 లక్షల టన్నులకు చేరవచ్చనీ ప్రాథమిక అంచనా. ఇతర దేశాలైన థాయ్‌లాండ్, వియత్నాంలకన్నా 10 శాతం తక్కువ ధరకే బాస్మతియేతర బియ్యాన్ని భారతదేశం సరఫరా చేస్తున్నందు వల్ల మన బియ్యానికి ఇతర దేశాల్లో(బంగ్లాదేశ్ లాంటి) గిరాకీ పెరిగిందని కృష్ణారావు గారు వెల్లడించారు.
థాయ్ కరెన్సీ విలువ పెరగడంతో ఆ దేశంలో బియ్యం ఖర్చుతో కూడుకున్నది. అది చాలదన్నట్లు తీవ్ర అనావృష్టి వల్ల పోయిన ఏడాది థాయ్ వరి పంట దెబ్బతిన్నది. దానీతో గత ఏడాది 75 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసిన థాయ్‌లాండ్ ఈ ఏడాది 50 లక్షల టన్నులతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కరోనా ఆంక్షల సమయంలో థాయ్‌లాండ్, వియత్నాం బియ్యం ఎగుమతులను నిలిపేయగా, భారతదేశం మాత్రం ఎగుమతులు కొనసాగించి నికరమైన సరఫరాదారుగా పేరుతెచ్చుకొంది. ఇది మరిన్ని ఎగుమతికి సంబంధిన ఆర్డర్లు రావడానికి దోహదపడింది. ఇది మరిన్ని ఎగుమతికి సంబంధిన ఆర్డర్లు రావడానికి దోహదపడింది.
ఈసారి థాయ్‌లాండ్ లాంటి దేశం మలేసియా, ఇండొనేసియాలూ నుంచి కాకుండా భారత్ నుంచి బియ్యం కొంటుంది. ఇలా తూర్పు ఆసియాతో పాటు గల్ఫ్, ఆఫ్రికా దేశాలకూ బియ్యం అందించడం ద్వారా భారత్ కరోన కాలంలో ప్రపంచ ఆహార భద్రతకు భరోసాదారుగా నిలిచింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచ బియ్యం అవసరాలలో 32 శాతాన్ని ఒక్క భారతదేశమే తీరుస్తోంది. కరోనా సంక్షోభ కాలంలో ఆదాయాలు తగ్గి, సరఫరాకు సంబంధించి అనేక మార్గాలు మూతపడటం వలన ఆఫ్రికా దేశాల్లో ఆకలి కేకలు పెరిగాయి. ఈ దేశాల్లోని జనాభా అవసరాలను తీర్చే స్థాయిలో ఆహారోత్పత్తి అధికమవడం లేదు. భారతదేశం సరసమైన ధరలకు బియ్యం ఎగుమతి చేసి ఆఫ్రికాను ఆదుకొంటోంది. ప్రస్తుతం కంటైనర్ల కొరత లేకపోతే భారతదేశం మరింతగా బియ్యాన్ని ఎగుమతి చేసి ఉండేది అని ఒక అభిప్రాయం. కంటైనర్లు దొరక్కపోవడంతో భారత రేవుల్లో రవాణా నౌకలు బియ్యం లోడు చేసుకోవడానికి ఇంచుమించు నాలుగు వారాలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి.
ప్రపంచ దేశాలను మరోసారి అన్నపూర్ణగా ఆదుకుంటున్న భారతదేశం :
ప్రస్తుతం భారత దేశంలో ఆహార ధాన్యాలు అపార నిల్వలు ఉన్నాయి. బియ్యం, గోధుమ బఫర్ నిల్వలు ఉండాల్సిన దానికన్నా మూడురెట్లు ఎక్కువ ఉన్నాయి. కొన్నిచోట్ల ఎలుకలు తినివేయడం వలన, మరికొన్ని చోట్ల మనుషులు దొంగిలించడం ద్వారా లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ప్రభుత్వ గోదాముల నుంచి తరిగిపోతున్నాయి. ప్రస్తుత సమయంలో ఆహార ధాన్యాల ఎగుమతిని ఎక్కువ చేసి... వాటి యొక్క వృథాను, చోరీని అరికట్టి తద్వారా అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు.
మాజీ ప్రధాని వాజ్‌పేయీ గారి హయాములో 80 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతి చేసిన భారత్, ఈ ఏడాది 1.4 కోట్ల టన్నుల బియ్యంతోపాటు 18 లక్షల టన్నుల గోధుమలనూ ఎగుమతి చేయనుందని అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఒక అంచనా. లాభదాయక మార్గాల్లో ఆహార ధాన్యాలను ఎగుమతి చేసి వాటి కొండను కరిగించకపోతే వృథా ఎక్కువవుతుంది. నీటిని అధిక శాతం తీసుకునే వరి, గోధుమల నుంచి రైతులను అధిక ధరలను ఇచ్చే, ప్రపంచ మార్కెట్లల్లో డిమాండ్ ఉన్న పండ్లు, కూరగాయల సాగు వైపు క్రమంగా మళ్లించడం ద్వారా ప్రస్తుతం ఉన్న బఫర్ నిల్వలను మనకి సరిపడ స్థాయికి తీసుకురావొచ్చు. ఆహార ధాన్యాల ఎగుమతులు, అమ్మకాల ద్వారా 1,50,000 కోట్ల రూపాయలు ఆర్జించవచ్చు, అలాగే రవాణా ఖర్చుల్లో రూ.20,000 కోట్లు ఆదా చేయవచ్చు. ఇలా వచ్చిన నిధులను ఇతర వ్యవసాయ సరకుల ధరల స్థిరీకరణ నిధిగా వినియోగిస్తే, పంటలు పండించే రైతులతో పాటు వినియోగదారులు కూడా లాభం చేకూరుతుంది.
ప్రపంచ దేశాల తీరు :
గత ఏడాది ఆసియాలోని అత్యధికంగా బియ్యం ఎగుమతి దేశాల్లో అనేక కారణాల వల్ల ఉత్పత్తి తగ్గిపోవడమే కాదు, కరోనా వల్ల నౌకా రవాణా దెబ్బతిని ఎగుమతులకు విఘాతం ఏర్పడింది. కరోనా ఆంక్షల సమయంలో తమ జనాభా అవసరాల కోసం థాయ్‌లాండ్, వియత్నాం బియ్యం నిల్వలను పెంచుకోవడం వల్ల కూడా ఎగుమతులు తగ్గాయి. గత ఏడాది వియత్నాం 2,70,000 టన్నుల బియ్యాన్ని నిల్వ చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఇతర దేశాలూ ఇదే విధంగా ఆలోచిస్తున్నందు వల్ల 2020-21లో ప్రపంచంలో బియ్యం నిల్వలు 17.82 కోట్ల టన్నులకు చేరనున్నాయని అమెరికా వ్యవసాయ శాఖ అంచనా. ఇతర దేశాలు బియ్యం నిల్వల సమీకరణ కోసం, భారతదేశం నుంచి బియ్యం దిగుమతి చేసుకోవడం ఎక్కువైంది.
గత ఎన్నో ఏళ్లుగా భారతదేశం ప్రపంచ దేశాలకు అన్నపూర్ణ దేశంగా పేరు గాంచింది అంటే అతియోశక్తి కాదు. అన్ని దేశాలకు ఆహార పదార్థాలను రవాణా చేస్తూ మంచి పేరుని గడించింది. పురాణాల్లో కూడా భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. చరిత్ర పుటల్లో కూడా భారతదేశం అన్నపూర్ణ దేశంగా పేరుగాంచింది. అలాంటి పేరును మనం భావితరాలకు అందించాలంటే మనం మన దేశ వ్యవసాయాన్ని కాపాడుకోవాలి.
Written By
కొన్నిపాటి రవి
ట్విట్టర్ : @KPR_india
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com