జగ్గంపేట ( జనస్వరం ) : అయిదేళ్ల క్రితం గత ఎన్నికలలో జగనన్న పాదయాత్రలో అంగన్వాడీల జీతం పెంచుతామని మాయ మాటలు చెప్పి హామీ ఇచ్చి నేటికీ నాలుగున్నరేళ్ళ సమయం గడుస్తున్నా కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు అంతా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జగ్గంపేటలో నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు అంతా కలిసి స్థానిక ఎండిఓ ఆఫీసు వద్ద నిరసన చేస్తున్న విషయం తెలిసిన వెంటనే వారి వద్దకు వెళ్ళి వారు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియచేసిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ నోటికి వచ్చిన దొంగ హామీలు అన్ని ఇచ్చుకుంటూ ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి గద్దెనెక్కడం జరిగిందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అంగన్వాడీల విషయం పూర్తిగా పక్కన పెట్టారు. ఇప్పుడు అంగన్వాడీలు అంతా కలిసి అడుగుతున్న డిమాండ్లు అన్ని చాలా న్యాయబద్ధమైనవని ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని ఆచరణలో పెట్టాలని అన్నారు. సమాజం సక్రమంగా అభివృద్ధి చెందడంలో అంగన్వాడీల పాత్ర చాలా కీలకమని, పోషణ లోపంతో తల్లి, బిడ్డ మరణాలు సంభవించకుండా ఒక స్త్రీ తన కడుపులో బిడ్డను మోయడం మొదలు పెట్టిన దగ్గర నుండి ఆ బిడ్డకు అయిదు సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లి యొక్క పోషణ మరియు బిడ్డ యొక్క సంరక్షణ చూసుకుంటూ, ఆ పిల్లలకు మానవతా విలువలు నేర్పుతూ పెంచే భాధ్యత కూడా అంగన్వాడీల మీద ఆధారపడి ఉంటుందని వారిని కొనియాడారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో స్థానికంగా ఉన్న వారిలో ఎవరికైనా కరోనా వస్తే వారికి మందులు ఇవ్వడం దగ్గర నుండి అన్ని బాగోగులు చూసుకోవడం వరకు వారి సేవలు ప్రశంసనీయం అన్నారు. అలాంటిది వారి జీతాలు నెలకు 26000 రూపాయల వరకు పెంచడం, వారి ఉద్యోగ విరమణ సమయంలో వారికి సెటిల్మెంట్ గా ఇచ్చే డబ్బును 5 లక్షల రూపాయల వరకు పెంచడం, ఇంకా వారికి కావలసిన వంట గ్యాస్ దగ్గర నుండి పోషక విలువలతో కూడిన ఆహార ధాన్యాలు అందించడం వరకు అన్ని సక్రమంగా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ ప్రభుత్వ హయాంలో ఈ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో మరో మూడు నెలల్లో జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలు అన్నీ తీర్చి, వారి డిమాండ్లు అన్ని నెరవేర్చి వారికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.