అమరావతి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ నార్కొటిక్స్‌కు కేంద్రంగా మారిందని, రాష్ట్రంలో డ్రగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విరుచుకుపడ్డారు. దీని ప్రభావం యావత్‌దేశంపై చూపుతోందని, దీనికి ప్రధాన కారణం పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమేనని ధ్వజమెత్తారు. డ్రగ్స్, గంజాయి రవాణాపై బుధవారం ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్లు కాకరేపుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి మూలాలు ఉన్నాయంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, నల్గొండ రేంజ్ డీఐజీ రంగనాథ్, బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్‌పంత్, ఢిల్లీలో ఏసీపీ సంతోష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లతో వరుస ట్వీట్‌లు చేశారు. అలాగే గంజాయి ముఠాలుగా పట్టుబడిన కథనాల క్లిప్పింగ్‌లను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
2018లోనే ఫిర్యాదులొచ్చాయి:
ఈ సందర్భంగా 2018లో తాను చేసిన పోరాట యాత్రను పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు గిరిజనుల నుంచి అనేక ఫిర్యాదులు తనకు అందాయని తెలిపారు. ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌లతో పాటు ప్రధానంగా గంజాయి వ్యాపారం మాఫియాపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. విభిన్న నేరపూరిత ముఠాలు అక్కడ ఉన్నట్లు స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. గంజాయి సాగు వాస్తవంగా సామాజిక, ఆర్దిక అంశమని, విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేక చదువులు పూర్తి చేసుకున్న యువత ఈ ట్రేడింగ్ లో చిక్కుకుంటున్నారని తెలిపారు. అయితే కింగ్‌పిన్స్ మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా సంపాదించుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం మన్యంలో గంజాయి పంట ముఖ్యదశలో ఉందని నవంబర్, డిసెంబర్ నుంచి కటింగ్ మొదలవుతుందని పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇంకా ఎక్కువగా గంజాయి బయటకు వెళ్తుందని తెలిపారు. గతంలో పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు గంజాయి పంటను ధ్వంసం చేసేవారని, ఇప్పుడు ఆ పనిని వదిలేసి బయటకు వెళ్లే దానిని పట్టుకుంటున్నారని చెప్పారు. స్థానికంగా స్వాధీనం చేసుకున్న గంజాయి కంటే రాష్ట్రం దాటిపోతున్న సరుకు ఎక్కువగా ఉంటున్నదని పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి :
గంజాయి రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంతరాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలని సూచించారు.