● ఒక్క రూపాయి కూడా కట్టకుండా 9 అంకణాల్లో ఇళ్ళు కట్టిస్తామని చెప్పి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మోసం చేశాడు
● ఇప్పుడు 6 అంకణాల స్థలాలేవో కూడా చూపట్లేదు
● ఒక్కో స్థలంలో ఇంటికి లక్ష రూపాయలు కట్టాలని ఇప్పుడు తలా 35వేల రూపాయలు కడితే చూపుతామంటున్నారు
● స్థలాలు చూపకుండా ఉన్నఫళాన ఇళ్ళు లేపేస్తామంటే మేమెక్కడికి పోవాలి
● పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన బాధితులు
● అండగా నిలుస్తామని, ప్రభుత్వ స్థలాలు, ఇళ్ళు ఇవ్వకుండా ఒక్క ఇంటిని తొలగించినా ఊరుకోమని ప్రజలకు భరోసాగా నిలిచిన కేతంరెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 46వ రోజున బర్మాషెల్ గుంట ప్రాంతం, శెట్టిగుంట రోడ్డు వద్ద జరిగింది. గత 60 ఏళ్ళకు పైగా నివసిస్తున్న తమ ఇళ్ళను తొలగించే ప్రయత్నాలు జరుగుతుండడంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొని ఉంది. వారంతా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్దకు చేరి వారి సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద బాధితులు వాపోతూ గడచిన ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ రైల్వే స్థలంలో నివసిస్తున్న సుమారు 400 కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 9 అంకణాల స్థలాల్లో ఇళ్ళు కట్టిస్తామని చెప్పినట్టు గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మోడళ్ళు దాటినా తమకు కనీస న్యాయం కూడా చేయకుండా ముఖం చాటేసి ఎమ్మెల్యే అనిల్ మోసం చేశాడని బాధితులు తెలిపారు. ఒకసారి టిడ్కో ఇళ్ళంటారు, మరొకసారి 6 అంకణాల స్థలాలు అంటారు తప్పించి తమకు న్యాయం చేయట్లేదని వాపోయారు. 6 అంకణాల స్థలాలు చూపెడితే తామే గుడిసెలు వేసుకుంటాం అని చెప్తుంటే ప్రభుత్వం అందుకు ఒప్పుకోవట్లేదన్నారు. ఒక్కో స్థలంలో ఇంటికి తలా లక్ష రూపాయలు కట్టాలని, ప్రస్తుతం 35వేల రూపాయలు కడితే నిర్మాణాలు ప్రారంభం అవుతాయని చెప్తున్నారని, అంత డబ్బుని నిరుపేదలం తీసుకురావాలి అని ప్రశ్నించారు. కొంతమంది ఇప్పటికే 15వేల నుండి 20వేల రూపాయల వరకు కట్టినా కూడా వారికి కూడా స్థలాలు చూపెట్టలేదని ఆవేదన చెందారు. స్థలాలు చూపెట్టకుండా ఉన్నఫళాన తమ ఇళ్ళు లేవదీస్తే తామంతా ఎక్కడికి వెళ్ళాలని వాపోయారు. తమ ఇళ్ళకు కరెంట్ తొలగించారని, నీటి కుళాయిలు తొలగించారని, ఎండకు ఎండి వానకు తడుస్తూ, దోమలు, దుర్గంధం నడుమ నరకం అనుభవిస్తున్నట్లు వివరించారు. ఇందుకా ఒక్క అవకాశం ఇద్దామని జగన్ ని గెలిపించాం అని వారు ఆవేదన చెందారు. ప్రజలందరి బాధలను, సమస్యలను సావధానంగా విన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి బర్మాషెల్ గుంట ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ తరఫున అండగా నిలుస్తామని అన్నారు. ఇప్పటికే నిర్మాణమై ఉన్న టిడ్కో ఇళ్ళను వీరికి కేటాయించి తక్షణం ఈ 400 కుటుంబాలను తరలించాలని, టిడ్కో ఇళ్ళు ఇవ్వడానికి సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే తెలిపి, కనీసం 6 అంకణాల స్థలాలను అయినా తక్షణం కేటాయించాలని డిమాండ్ చేసారు. పేదలు అప్పోసొప్పో చేసైనా కనీసం గుడిసెలు వేసుకుని బ్రతుకుతారని, ఎటువంటి ఆధారం చూపకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. పేదలకు ప్రత్యామ్న్యాయం చూపకుండా ఇళ్ళను తొలగిస్తే జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపిచ్చి ప్రజలకు అండగా నిలిచి పోరాడతామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.