ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నివాసంలో నటుడు అల్లు అర్జున్ సందడి చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బ్రహ్మానందం నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహం చేసుకున్న బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్ - ఐశ్వర్య దంపతులకు అభినందనలు తెలిపారు. కుటుంబసభ్యులతో కాసేపు సరదాగా మాట్లాడుతూ గడిపారు. ఇదిలా ఉండగా, ఉత్తమ నటుడిగా బన్ని జాతీయ అవార్డు సొంతం చేసుకోవడంపై బ్రహ్మానందం ఆనందపడ్డారు. పుష్పగుచ్ఛం అందచేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు అల్లు అర్జున్‌కు అవార్డు రావడంపై నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, మయాంక్ హర్షం వ్యక్తం చేశారు. బన్నిని కలిసి ప్రత్యేకంగా అభినందించారు.
బ్రహ్మానందంతో అల్లు అర్జున్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఓసారి వేంకటేశ్వర స్వామి ఫొటోను స్వయంగా స్కెచ్ చేసి అల్లు అర్జున్‌కు బహుమతిగా అందించారు. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహం ఆగస్టు 19న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల బన్ని పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలోనే తాజాగా నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com