Search
Close this search box.
Search
Close this search box.

ఉద్దానంపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవి అన్నీ ఉత్తుత్తి మాటలే!

● కిడ్నీ రోగుల దయనీయ స్థితి
● 11 మండలాల్లో 35,000 మంది వ్యాధిగ్రస్తులు
● 4500 మంది మృతి చెందినా పట్టించుకోని వైనం
● కనీస చేయూత సైతం కరవు
● వైకాపా హామీలన్నీ నీటిమూటలే
● తల్లడిల్లుతున్న వేలాది కుటుంబాలు
● చీమ కుట్టినట్టయినా లేని జగన్‌ ప్రభుత్వం
● పరిశోధనలకు సైతం సహకరించని వైనం
అది ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రాంతానికి మాత్రమే చెందిన సమస్య కాదు… అంతర్జాతీయ సమాజాన్ని సైతం కలవరపరుస్తున్న దయనీయ పరిస్థితి! అది కేవలం కొన్ని మండలాలలో కనిపించే దుస్థితి మాత్రమే కాదు… ప్రపంచ పరిశోధకులకు కూడా పరిష్కారం దొరకని చిక్కు ప్రశ్న! అవడానికి కిడ్నీల వైఫల్యంతో తలెత్తుతున్న రోగమే… కానీ… అంతుపట్టని కారణాలతో ప్రపంచానికే అదొక సవాలు! అదే… పరిశోధకుల వాడుకలో ”ఉద్దానం నెఫ్రోపతి”! వైద్య పరిభాషలో ”క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌”!పేరేదైతేనేం… అంతుపట్టని విధంగా ఒకే ప్రాంతంలో వ్యాపిస్తున్న ఈ రోగం వల్ల ఇప్పటి వరకు 35,000 మంది వ్యాధిగ్రస్తులుగా మారారు. కుటుంబాలకు కుటుంబాలు ఈ వ్యాధి బారిన పడి ఉపాధి కోల్పోయి అణగారిపోతున్నారు. ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఈ వ్యాధి గురించిన వివరాలను తెలుసుకోడానికి ముందు కొన్ని అంశాలు ప్రస్తావించుకోవాలి.
దీనిపై అంతర్జాతీయంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి.
●ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిపై కలవరం వెలిబుచ్చుతోంది.
●ఎన్నో సంస్థల తరఫు నుంచి పరిశీలక బృందాలు ఈ ప్రాంతానికి వచ్చి కారణాలు తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి.

 అయితే వీటన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం మరోటి ఉంది…అదేంటంటే… ఇంత జరుగుతున్నా జగన్‌ ప్రభుత్వం స్పందన మాత్రం అంతంతమాత్రం! ఆర్భాటమైన ప్రకటనలే తప్ప ఆచరణలో జరుగుతున్నది శూన్యం! హామీలే తప్ప బాధితులకు ఒరుగుతున్న ప్రయోజనం హీనాతిహీనం!!
కారణం… నిర్లక్ష్యం! ప్రజల బాధలు పట్టని బాధ్యతారాహిత్యం!!!

● ఏమిటీ ఉద్దానం? ఏమిటీ సమస్య?
ఎటు చూసినా కొబ్బరి తోటలతో, జీడిమామిడి చెట్లతో, పనస, మామిడి సాగుతో, పంటపొలాలతో ఆహ్లాదకరమైన ఆకుపచ్చని వాతావరణంతో… మరో వైపు నాగావళి, వంశధార, మహేంద్ర తనయ నదుల గలగలలతో ఆకట్టుకునే ప్రాంతమే… ఉద్దానం.
”ఉద్దానం” అంటే… ఉద్యానవనమని అర్థం. ఆ పేరుకు తగినట్టుగానే కనిపించే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలను నిశితంగా పరిశీలిస్తే మాత్రం… ఆహ్లాదానికి బదులు ఆవేదనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరి మొహం చూసినా ఏదో తెలియని దిగులు. ఏ ఇంట్లో చూసినా ఏమిటో అర్థం కాని దైన్యం. అందుకు కారణం ఆ ప్రాంతంలో అత్యధికులు అంతుపట్టని విధంగా కిడ్నీ వ్యాధికి గురవడమే. ”అల్లా సికాకులం సివర వజ్రపు కొత్తూరు కాడ నుంచి ఇచ్చాపురం దాకా జనాలు సచ్చిపోతున్నారు. రోగులుగా మారిపోతన్నారు. ఎవురెవురో వత్తన్నారు. ఏటేటో అడుగుతన్నారు. కానీ ఓలూ సరైన కారణం సెప్పలేకపోతన్నారు… ఏంటో” అంటూ చెబుతుంటారు ఆ ప్రాంతానికి చెందిన అమాయకపు పల్లెటూరి జనం. అధికారులు, వైద్యులు, పరిశోధకులు, పరిశీలకులు, విదేశీయులు… ఇలా ఎందరెందరో అక్కడికి వచ్చి అందరినీ ప్రశ్నించి, వివరాలు రాసుకుని వెళుతుండడం అక్కడి ప్రజలకు అలవాటైపోయింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సరిహద్దుల్లో ఉండే శ్రీకాకుళం జిల్లా సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, పలాస, మందస తదితర 11 మండలాలను కలిపి ‘ఉద్దానం’ అని వ్యవహరిస్తారు. ఈ ప్రాంతం జనాభాలో అత్యధికులు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారనే విషయం తొలిసారిగా 1990లో గుర్తించారు. అలా 2015 కల్లా 35,000 మంది రోగులున్నట్టు బయటపడింది. దాదాపు 4500 మంది మరణించారు. అయితే ఈ ప్రాంతంలోనే ఈ వ్యాధి ఎందుకు వ్యాప్తి చెందుతోందో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఈ సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ”కారణాలు అతి తక్కువ తెలిసిన సమస్య ఇది. వైద్య ఆరోగ్య పరిశోధకులు మరింత దృష్టి పెట్టాల్సిన విషయం ఇది” అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై అంతర్జాతీయంగా చర్చ జరిగింది. చైనాలోని హాంగ్‌కాంగ్‌లో 2013లో జరిగిన ”ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ” సదస్సులో దీని గురించి చర్చించి, దీనికి ”ఉద్దానం నెఫ్రోపతి” అనే పేరు పెట్టారు. అప్పటి నుంచీ ఇది ఉద్దానం సమస్యగా మారిపోయింది. ఇప్పటివరకు ఎందరో దీనిపై పరిశోధనలు చేశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి, హార్వర్డ్‌ యూనివర్శిటీ, కింగ్‌ జార్జి హాస్పిటల్‌, ఆంధ్రా యూనివర్శిటీ, డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ లాంటి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతానికి వచ్చి పరిశోధనలు, పరిశీలనలు జరిపారు. ఉద్దానం ప్రజల ఆహారపు అలవాట్లు, వాళ్లు పొలాల్లో వాడుతున్న ఎరువులు, రసాయనాలు, అక్కడి వారు తాగుతున్న నీటి వనరులు, ధూమపానం మద్యపానం లాంటి అలవాట్లు, తరచు వాడే మందులు ఇలా ఎన్నో కోణాల్లో ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలోనే ఎందుకు కిడ్నీ వ్యాధులు విజృంభిస్తున్నాయనే విషయానికి సరైన కారణం మాత్రం ఇంతవరకు చెప్పలేకపోయారు.

● నిర్లక్ష్యమే అసలు సమస్య
      అంతర్జాతీయ సమాజాన్ని సైతం కలవరపరుస్తున్న ఇంతటి సామాజిక సమస్యపై వైకాపా ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేస్తోంది?? అని తరచి చూసుకుంటే… చేసింది శూన్యమనే చెప్పుకోవాలి. అందుకు ఉదాహరణేంటో చూద్దాం… సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంగా… ”కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగుల ప్రయోజనం కోసం ప్రతి ప్రాధమిక వైద్య కేంద్రంలోనూ డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ప్రాధమిక స్థాయిలో మందులు వినియోగించే ప్రతి బాధితుడికి నెలకు రూ.10,000 వంతున పింఛన్‌ ఇస్తాం” అంటూ హామీలు గుప్పించారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అధికారం అందుకుని మూడున్నరేళ్లు అయింది. మరి ఆయన మాటలు నిజమయ్యాయా? అనేది పరిశీలిస్తే చాలు అసలు బండారం బయటపడుతుంది. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్ని డయాలసిస్‌ కేంద్రాలున్నాయో, ఇప్పుడూ అవే ఉన్నాయి. అంటే… జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి పీహెచ్‌సీలోనూ డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న హామీ గాలికి ఎగిరిపోయినట్టే. కేవలం ఒక్క మందస మండలం హరిపురంలో మాత్రమే ఒకటి పెట్టారు. గతంలో ఇక్కడి రోగుల కోసం దాదాపు 27 రకాల మందులను ఉచితంగా అందించేవారు. ఇప్పుడు అవి సక్రమంగా అందడం లేదు. మందుల పంపిణీ కోసం గతంలో ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయింపులు జరిపేవారు. ప్రస్తుతం రెండేళ్లుగా ఈ కేటాయింపులు నిలిపివేయడంతో రోగులకు మందులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇక పింఛన్ల సంగతి చూద్దాం. ప్రభుత్వ పరంగా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న 114 గ్రామాల్లోనే 19,502 మంది కిడ్నీ రోగులున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ కేవలం 787 మందికే పింఛను అందుతోందంటే, మాటలకీ చేతలకీ ఎంత వ్యత్యాసముందో ఇట్టే అర్థమవుతుంది. డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులు సైతం వేలల్లో ఉండగా, పింఛన్‌ మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే అందిస్తున్నారంటే ఎంత మొక్కుబడిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందో వేరే చెప్పనక్కరలేదు. కిడ్నీ రోగులకు తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పని సరి. అందుకోసం నెఫ్రాలజీ నిపుణులైన వైద్యులు అవసరం. కానీ ఈ ప్రాంతంలో వీరి కొరత వేధిస్తోంది. ఇక 19 ఆరోగ్య కేంద్రాలలో వైద్య పరీక్షలకు అవసరమైన 23 ఎనలైజర్లలో కేవలం ఆరు మాత్రమే పనిచేస్తున్న దుస్థితి. కానీ ఈ విషయాన్ని పట్టించుకునే నాథుడు లేక రోగులు నానా పాట్లూ పడుతున్నారు. అందుబాటులో వైద్య పరీక్షా కేంద్రాలు, చికిత్స సదుపాయాలు లేకపోవడంతో గ్రామాల నుంచి ఆ సౌకర్యాలు ఉన్న ప్రాంతాలకు వెళ్లాలంటే రోగులకు వేలకు వేలు ఖర్చవుతోంది. ఎలాగోలా ఆయా కేంద్రాలకు వెళ్లినా మందుల పంపిణీ లేకపోవడం, ఇంజెక్షన్లు బయట కొనుక్కోవలసి రావడంతో మరిన్ని వ్యయప్రయాసలకు రోగులు గురవుతున్నారు. ఇక పరిశోధన బృందాలకు సైతం వైకాపా ప్రభుత్వం నుంచి లభిస్తున్న సహకారం రిక్తహస్తమే. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలను అర్ధంతరంగా ఆపివేయాల్సిన వస్తోంది. ప్రపంచం దృష్టిని సైతం ఆకట్టుకుని కలవరపెడుతున్న ఈ సామాజిక సమస్యపై వైకాపా ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తోందనే ఆరోపణలు రోగుల నుంచే కాదు సర్వేసర్వత్రా వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టయినా లేదు.

 ● చిత్తశుద్ధి ఉంటే…
    ప్రజల బాధ పట్ల బాధ్యత ఉంటే అధికారం లేకపోయినా ఎంతో చేయవచ్చని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిరూపించిన విషయాన్ని ఉద్దానంలోని రోగులు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక్కడి సమస్య గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడానికి, రోగులకు కల్పించాల్సిన సదుపాయాల గురించి ప్రభుత్వం కార్యాచరణకు పూనుకోడానికి ఆయనే ఒక విధంగా కారణమయ్యారు. ఎలాగంటే… 2017లో ఈ ప్రాంతంలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దృష్టికి ఉద్దానం సమస్యను ప్రస్ఫుటంగా తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆరు డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటవడంతో ఎంతో మంది రోగులకు ఊరట కలిగింది. హార్వర్డ్‌ నుంచి ప్రత్యేకమైన వైద్య పరిశోధన బృందాన్ని ఉద్దానం తీసుకురాగలగడంతో పాటు, వారితో కలిసి అప్పటి ముఖ్యమంత్రిని కలిసి సమస్య తీవ్రతను సరైన పంథాలో ఆవిష్కరించగలిగారు.

● ప్రభుత్వం ఏమి చేయవచ్చు?
       ప్రగల్భాలే తప్ప పని చేయని వైకాపా ప్రభుత్వం నిజంగా ఉద్దానం ప్రజలకు మేలు చేయదల్చుకుంటే ఎన్నో విధాలుగా ఆదుకోవచ్చు.
●సాధ్యమైనన్ని డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
●ప్రతి మండలంలో వైద్యపరీక్షలు, చికిత్స జరిగేలా చర్యలు తీసుకోవాలి.
●ఉన్న ఊరి నుంచి వైద్య కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా రోగులందరికీ ఉచిత బస్‌ పాస్‌లు అందించాలి.
● రోగులకు సక్రమంగా మందులు అందించే చర్యలు చేపట్టాలి.
● పింఛను పథకాన్ని విస్తరించాలి.
●పరిశోధనలు మరింత ఊపందుకునేలా నిధులు కేటాయించాలి.
● జల కాలుష్యం వల్ల రోగం ప్రబల కుండా రక్షిత మంచి నీటి సరఫరా చేయాలి.
● పొలాల్లో రసాయనాల వినియోగాన్ని తగ్గించి రైతులను సేంద్రీయ సాగు విధానాలకు అలవాటు చేయాలి.
●ఉద్దానం ప్రాంతంలో పౌష్ఠికాహారాన్ని అందించే ఏర్పాటు చేయాలి.
ఇలా ఎన్నో రకాలుగా ఉద్దానం ప్రజలను ఆదుకోవచ్చు. కానీ మొద్దు నిద్రపోతున్న వైకాపా ప్రభుత్వం వీటిలో ఏ ఒక్కటీ సరిగా అమలు చేయడం లేదన్నది కఠోర వాస్తవం. అందుకు కారణం ఒక్కటే… ఉద్దానంలో ఉన్నది కిడ్నీ సమస్య! వైకాపా ప్రభుత్వానికి ఉన్నది బ్రెయిన్‌ సమస్య!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way