అనంతపురము, జులై 16, జనస్వరం : ప్రసిద్ధ అభ్యుదయకవి అడిగోపుల వెంకటరత్నం పేరుమీద ఆయన కుటుంబ సభ్యులు నెలకొల్పిన "అడిగోపుల సాహిత్య ప్రతిభా పురస్కారం -2026" ను సుప్రసిద్ధ అభ్యుదయ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డికి 17 వ తేది ప్రదానం చేయనున్నారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 5:00 గంటలకు జరగనున్న సభలో ఈ పురస్కారాన్ని రాచపాలెంకు అందజేయనున్నట్లు ఆస్ట్రేలియా "తెలుగుసందడి" సాహిత్య, సాంస్కృతిక వ్యవహారాల సంచాలకుడు అడిగోపుల శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున అధ్యక్షతన జరిగే సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ కవి, రచయిత, సాహితీ విమర్శకులు ఆచార్య రావెల సాంబశివరావు హాజరై అవార్డును ప్రదానం చేస్తారని తెలిపారు. వక్తగా ప్రముఖ కవి బీరం సుందరరావు, విశిష్ట అతిథులుగా ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య ఈ. సత్యనారాయణ, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు ఆకుల మల్లేశ్వరరావు, తెలుగు భాషోద్యమ సమాఖ్య వ్యవస్థాపకులు, అరసం రాష్ట్ర నాయకులు సాకం నాగరాజు హాజరవుతారని వివరించారు.
ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, తెలుగు; పిహెచ్.డి (1970 - 77) చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, యోగివేమన విశ్వవిద్యాలయాలలో 38 ఏళ్ళు తెలుగు అధ్యాపకుడుగా పని చేశారు. 102 విమర్శ, పరిశోధన, కవిత్వ, సంపాదక పుస్తకాలు ప్రచురించారు. 45 మంది పరిశోధకులకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సలహామండలి సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం రాష్ట్ర సభ్యుడిగా పని చేశారు. కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు 23 పురస్కారాలు అందుకున్నారు.
అర్థ శతాబ్దకాలం సాహిత్య సేవలో 30 గ్రంథాలతో అభ్యుదయ కవిత్వాన్ని సమృద్ధి చేసిన "అడిగోపుల వెంకటరత్నం స్మారక పురస్కారాన్ని", తెలుగు సాహిత్య విమర్శను అర్థ శతాబ్దకాలం విస్తృతపరచిన ఆచార్య రాచపాలెంకు అందజేయడం సముచితంగా భావిస్తున్నామని అడిగోపుల శ్రీకాంత్ పేర్కొన్నారు. 50 సంవత్సరాలుగా మొక్కవోని దీక్షతో సాహిత్య విమర్శకు అంకితమైన ఆచార్య రాచపాలెం తెలుగు నేలంతా తెలిసిన విమర్శకులని అన్నారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను తనదైన భావజాలంతో నిరంతరం విశ్లేషించే రాచపాలెం ఎందరో యువ రచయితలకు ప్రోత్సాహమిస్తున్నారని తెలిపారు. ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం, నవల, కథానిక, నాటకం, సాహిత్య విమర్శ, దాక్షిణాత్య సాహిత్యం, భారతీయ సాహిత్యం వంటి అనేక ముఖాలుగా తెలుగు సాహిత్య విమర్శను విస్తరింప చేస్తున్న విమర్శకులు రాచపాలెం ఈ పురస్కారానికి అన్ని విధాలా తగినవారని శ్రీకాంత్ వివరించారు. రాచపాలెం రచించిన "దరి - దాపు" గ్రంథం ఎం.ఏ తెలుగు విద్యార్థులకు పాఠ్య గ్రంథమైందని, ఆచార్య హెచ్.ఎస్ బ్రహ్మానందతో కలిసి రచించిన "సాహిత్య బోధనా పద్ధతులు" సాహిత్య అధ్యాపకులకు, "సాహిత్య పరిశోధన సూత్రాలు" గ్రంథం సాహిత్య పరిశోధకులకు నిత్యం ఉపయోగంలో ఉన్నాయన్నారు. ఆయన పర్యవేక్షణలో 45 మంది విద్యార్థులు పరిశోధన చేశారని తెలిపారు. రాచపాలెం రచించిన "మన నవలలు - మన కథానికలు" అనే గ్రంథానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందన్నారు. అంతటి ప్రసిద్ధ విమర్శకునికి అడిగోపుల పేరుతో పురస్కారం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని శ్రీకాంత్ పేర్కొన్నారు.
