Logo
Date of Publish : 24 May 2026, 7:49 pm
Editor : Sake Naresh

అరసం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆచార్య రాచపాళెం

వరుసగా నాలుగోసారి ఏకగ్రీవ ఎంపిక - పలువురి అభినందనలు :

అనంతపురము, మే 24, జనస్వరం : సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి వరుసగా నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ నెల 23, 24 తేదిల్లో తిరుపతిలోని గంధమనేని శివయ్య హాల్లో జరిగిన అరసం 20వ రాష్ట్ర మహాసభలు, 83వ వార్షికోత్సవ సభలో ఈ మేరకు నిర్ణయించారు. రాష్ట్ర గౌరవాధ్యక్షురాలిగా ప్రొ. సంజీవమ్మ, ప్రధాన కార్యదర్శిగా వల్లూరు శివప్రసాద్ ఎంపికయ్యారు. అనంతరం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ, తెలుగు; పిహెచ్.డి (1970 - 77) చేశారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, యోగివేమన విశ్వవిద్యాలయాలలో 38 ఏళ్ళు తెలుగు అధ్యాపకుడుగా పని చేశారు. 102 విమర్శ, పరిశోధన, కవిత్వ, సంపాదక పుస్తకాలు ప్రచురించారు. 45 మంది పరిశోధకులకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడుగా, నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సలహామండలి సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యుడిగా పని చేశారు. కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు 23 పురస్కారాలు అందుకున్నారు. యాభై సంవత్సరాలుగా మొక్కవోని దీక్షతో సాహిత్య విమర్శకు అంకితమైన ఆచార్య రాచపాలెం తెలుగు నేలంతా తెలిసిన విమర్శకులని పలువురు అభినందించారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను తనదైన భావజాలంతో నిరంతరం విశ్లేషించే రాచపాలెం ఎందరో యువ రచయితలకు ప్రోత్సాహమిస్తున్నారని తెలిపారు. ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం, నవల, కథానిక, నాటకం, సాహిత్య విమర్శ, దాక్షిణాత్య సాహిత్యం, భారతీయ సాహిత్యం వంటి అనేక ముఖాలుగా తెలుగు సాహిత్య విమర్శను విస్తరింప చేస్తున్న విమర్శకులు రాచపాలెం అధ్యక్ష పదవికి అన్ని విధాలా తగినవారని వివరించారు. రాచపాలెం రచించిన "దరి - దాపు" గ్రంథం ఎం.ఏ తెలుగు విద్యార్థులకు పాఠ్య గ్రంథమైందని, ఆచార్య హెచ్.ఎస్ బ్రహ్మానందతో కలిసి రచించిన "సాహిత్య బోధనా పద్ధతులు" సాహిత్య అధ్యాపకులకు, "సాహిత్య పరిశోధన సూత్రాలు" గ్రంథం సాహిత్య పరిశోధకులకు నిత్యం ఉపయోగంలో ఉన్నాయన్నారు. ఆయన పర్యవేక్షణలో 45 మంది విద్యార్థులు పరిశోధన చేశారని తెలిపారు. రాచపాలెం రచించిన "మన నవలలు - మన కథానికలు" అనే గ్రంథానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందన్నారు.

రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నుంచి నలుగురికి చోటు :

అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అనంతపురం జిల్లాకు చెందిన నలుగురు కవులు, రచయితలను ఎన్నుకున్నారు. సీనియర్ కవి, రచయిత, సాహితీ విమర్శకులు, సామాజిక కార్యకర్త గుత్తా హరిసర్వోత్తమ నాయుడును అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించారు. అరసం జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్న బి. ఈశ్వర రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి తన్నీరు నాగేంద్ర లకు రాష్ట్ర కార్యవర్గంలో కూడా చోటు కల్పించారు. అలాగే సీనియర్ రచయిత వంకిరెడ్డి రెడ్డెప్ప రెడ్డికి అవకాశం దక్కింది. రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడం పట్ల వారు ధన్యవాదములు తెలిపారు. తమపై వుంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకుంటామని పేర్కొన్నారు. అరసం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి కొనసాగిస్తామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com