అమరావతి, (జనస్వరం) : రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న బోయ/వాల్మీకి కులస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చాయని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆ సామాజిక వర్గం అభివృద్ధితో పాటు వారిని విద్యాపరంగా, రాజకీయపరంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి అనే అంశంపై పవన్ కల్యాణ్ ఆలోచన చేస్తున్నారని చెప్పారు. బుధవారం ఉదయం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ప్రతినిధులు నాదెండ్ల మనోహర్ ని కలసి తమ సమస్యలను వివరించి వినతి పత్రం అందించారు. వాల్మీకి, బోయ, బేడర, నిషాద… ఇలా పలు పేర్లతో ఉన్న వాల్మీకి బోయ సామాజికవర్గం దశాబ్దాల నుంచి అణచివేతకు గురవుతోందనీ… విద్య, ఉద్యోగపరంగా ఎదగలేకపోతున్నామని సంఘం ప్రతిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీల్లో తమ కులాలను చేర్చాలనే డిమాండ్ పై గత ప్రభుత్వంగానీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంగానీ చిత్తశుద్ధితో స్పందించలేదని తెలిపారు. పొరుగున ఉన్న కర్ణాటకలో ఎస్టీల్లోనే ఉన్నామని చెప్పారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “వెనకబాటుతనంతో ఉన్న వాల్మీకి బోయ సామాజికవర్గం సమస్యలపై జనసేన పార్టీ సమగ్రంగా చర్చిస్తుంది. క్షేత్ర స్థాయి నుంచి ఈ అంశంపై అధ్యయనం చేసి వీరికి న్యాయం జరిగేలా చూస్తాం. సంఘం ప్రతినిధులు ప్రసావించిన సమస్యలను పవన్ కల్యాణ్ కి తెలియచేస్తాం. త్వరలో పవన్ కళ్యాణ్ తో వీరి సమస్యలపై విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తాం” అన్నారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా జనసేన నాయకులు ఎన్.మల్లప్ప, ఏపీ వాల్మీకి బోయ సంఘం ఉపాధ్యక్షులు బి.క్రాంతి నాయుడు, ప్రధాన కార్యదర్శి జక్కుల శ్రీనివాసరావు, సంఘం నాయకులు బి.వినోద్ కుమార్, బి.సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.