విజయనగరం ( జనస్వరం ) : రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో పరిపాలన ఉండేలా పాలకులకు, అధికారులకు బుద్ధినివ్వాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు గొర్లి చంటి, వంగల దాలి నాయుడు, రాజాన రాంబాబు, మండల శరత్ కుమార్, మానేపల్లి ప్రవీణ్, పతివాడ వంశీ, రౌతు బాలాజీ, పి.అశోక్ కుమార్ తదితరులు పార్వతీపురం మెయిన్ రోడ్ లోని జిల్లా ఆసుపత్రి జంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగాలని పౌరుల కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగజేయకుండా అధికారులకు పాలకులకు హితవు పలకాలన్నారు. బడుగు, బలహీన, పేద, నిరుపేద, అణగారిన వర్గాలను, ఎక్కువ తక్కువ అనే వివక్షతకు తావు లేకుండా, దోపిడీ, దౌర్జన్యం, అవినీతి, అక్రమాలు, ఆక్రమణలకు చోటు లేకుండా సమ సమాజం ఉండేలా యువతకు ఉద్యోగం, రైతులకు గిట్టుబాటు, కార్మికులకు శ్రమకు తగ్గ ఫలం వచ్చేలా పాలన సాగేలా పాలకులకు, అధికారులకు బుద్ధి ప్రసాదించాలన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం, నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకొనెలా బుద్ధి ప్రసాదించాలన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ స్థలాల కబ్జాలు, బలవంతుల దౌర్జన్యాలు, నాటుసారా, అసాంఘిక కార్యక్రమాలు తదితరవి అరికట్టే విధంగా పాలన చేసే విధంగా అధికారులకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించే ఉద్యోగ విధులు సక్రమంగా నిర్వర్తించేలా బుద్ధి ప్రసాదించాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.