రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట నియోజకవర్గంలో గత ఏడాది వచ్చిన వరదలకు మందపల్లి, పులపత్తూరు గ్రామాల్లో ఉన్న ఇండ్లు పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయాయి. వరదలు వచ్చి ఏడాది అవుతున్న వాళ్ళకి ప్రభుత్వం ఇళ్ళు కట్టించలేదని జనసేన నాయకులు వాపోయారు. మందపల్లి, పులపత్తూరు గ్రామాల పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు ఉండటానికి ఇండ్లు లేక గూడారాలు వేసుకొని బతుకుతున్నారన్నారు. గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వరదలు వచ్చిన సమయంలో ప్రభుత్వం పక్కా ఇళ్ళు నిర్మిస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినా, ఎపుడో ఒకసారి వచ్చే వరదలను ఎదుర్కొలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. వరద బాధితులను ఆదుకునే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వం వెంటనే పక్కా గృహాలు మంజూరు చేయకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమస్యను తీర్చే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా తీవ్ర నిరసనలు చేస్తామని తెలియజేశారు. కలెక్టర్ గారికి వినతిపత్రం అందించి, సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అతిగారి దినేష్, రామ శ్రీనివాస్, హరి రాయల్, నరహరి, శ్రీనివాస్, అజిత్ తదితరులు పాల్గొన్నారు.