
అనంతపురం, జూలై 18, జనస్వరం : కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) అనుమతిని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో వినూత్న ఉద్యమం కొనసాగుతోంది. జిల్లాలోని 63 మండలాల నుండి ప్రతి మండలంలోనూ 1,600 పోస్టుకార్డులను కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారికి పంపే లక్ష్యంతో "లక్ష పోస్టుకార్డుల ఉద్యమం"ను ఆర్డీటీ అభిమానులు, విద్యార్థులు ప్రారంభించారు. ఈ నెల 26 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
ఈ ఉద్యమంలో భాగంగా అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఈ రోజు భారీగా పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణం నుండి పోస్ట్ బాక్స్ వరకు ప్రదర్శనగా వెళ్లి పోస్టుకార్డులను వేసి తమ మద్దతును వ్యక్తం చేశారు. విద్యార్థులు మాట్లాడుతూ, “విద్యారంగ అభివృద్ధికి ఆర్డీటీ ఎంతో తోడ్పాటునిస్తుంది. మా కళాశాల భవనం నిర్మాణానికి ఆర్డీటీ రూ. 18 కోట్లు ఖర్చు చేసింది. ఇలాంటి సేవా సంస్థకు FCRA అనుమతి అవసరం,” అని తెలిపారు. అదే విధంగా అనంతపురం రూరల్ మండలంలోని కరుగుంట అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినులు కూడా పోస్టుకార్డులు రాస్తూ ఉద్యమంలో భాగమయ్యారు. వారు మాట్లాడుతూ, “కరోనా సమయంలో మాకు మాస్కులు, శానిటైజర్లు, ఇతర మౌలిక సదుపాయాలను అందించిన ఆర్డీటీ సేవలు మర్చలేనివి. ఇలాంటి సంస్థకు ప్రభుత్వం మద్దతుగా ఉండాలి,” అని అభిప్రాయపడ్డారు. ఇక రాప్తాడు మండలంలోని AP మోడల్ స్కూల్ విద్యార్థులు కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థులు మాట్లాడుతూ, “స్వయంరక్షణ శిక్షణలో భాగంగా కరాటే, యోగా వంటి అంశాలను ఉచితంగా అందించిన ఆర్డీటీ సహకారం అమూల్యం. విద్యా రంగంలో ఆ సంస్థ చేస్తున్న సేవలు గొప్పవే,” అని వివరించారు.
ఈ కార్యక్రమాల్లో అనంతపురం జిల్లా ఆర్డీటీ అభిమానుల సంఘం నాయకులు రాచానపల్లి సుబ్రహ్మణ్యం, అంజినేయులు, మన్నీల గోపాల్, తేజ, వెంకటరాముడు, వరిమడుగు వికర్ణ, న్యాయవాది ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా మొత్తంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తుండటం వల్ల లక్ష పోస్టుకార్డుల లక్ష్యం సుసాధ్యంగా మారిందని నిర్వాహకులు తెలిపారు.
