కదిరి టౌన్ ( జనస్వరం ) : గట్ల దగ్గర ఉన్న జగనన్న కాలనీని జనసేనపార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ సందర్శించారు. అక్కడ వారు లబ్ధిదారులను అడిగి వారుఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఇంతవరకూ రోడ్లు లేవని, వీధిదీపాలు లేవనీ, నీళ్లు కొనుక్కుంటున్నామని, ప్రభుత్వం ఇచ్చే 180000 రూపాయలు చాలక, దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు అప్పులు చేసి ఖర్చు పెట్టుకుంటున్నామని వాపోయారు. భైరప్రసాద్ మాట్లాడుతూ 2020 డిసెంబర్ నెలలో ప్రారంభించిన ఇండ్లు ఇప్పటికీ పూర్తి కాలేదని, గతంలో ముఖ్యమంత్రి గారు జూన్ 2022 నాటికి ఇల్లు పూర్తి చేసి వారికి అప్పజెప్తామని చెప్పారని అన్నారు. అలాగే మోడల్ కాలనీలుగా రూపొందిస్తామని రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి పేద ప్రజలను మోసం చేశారని తెలియజేశారు. ఆయన కేవలం సాక్షి పేపర్ కే పరిమితమై నవరత్నాల్లో భాగమైన పేద ప్రజలకు ఇల్లు అనే రత్నాన్ని అమలు చేశామని ప్రకటనలు మాత్రమే ఇస్తున్నారని, ఒక్కసారి జగనన్న కాలనీలలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రవీంద్ర, కుటాల లక్ష్మణ్, రెడ్డమ్మ, సాయి ప్రియ, ముజీబ్, హరిబాబు, రాజశేఖర్, లోకేష్, నరసింహులు, చిన్న తదితరులు పాల్గొన్నారు.