
అనంతపురం, అక్టోబర్ 28, (జనస్వరం) : రాప్తాడు నియోజకవర్గ జనసేన కార్యకర్తల భవిష్యత్ కార్యాచరణపై జిల్లా కేంద్రంలో విస్తృత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ముఖ్య నాయకులు, క్రియాశీల జనసైనికులు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ ప్రణాళికలపై లోతైన చర్చలు జరిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై ఉద్యమాత్మక పోరాటం, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం జరిగింది. సమావేశంలో కార్యకర్తలు తమ ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనసేన కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత అందలేదని పలువురు కార్యకర్తలు పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న శ్రేణులకు న్యాయం జరిగేలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో జనసేనకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలంటే గ్రామస్థాయి నుంచి వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక ప్రణాళిక అవసరమని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. బలమైన ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేసేలా ముందస్తు సన్నాహాలు చేయాలని, గెలుపు అవకాశాలు ఉన్న స్థానాల్లో సరైన అభ్యర్థుల ఎంపిక జరగాలని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలను పార్టీ బలోపేతానికి కీలకంగా మలచుకోవాలని నాయకులు సూచించారు.
ఈ సందర్భంగా రాప్తాడు జనసేన ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నేరుగా పోరాడే పార్టీగా జనసేన ఎప్పటికీ ముందుంటుందని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత, రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల మధ్యే ఉంటూ ఉద్యమాత్మకంగా ముందుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ జనసేన కార్యకర్తలకు న్యాయమైన వాటా లభించే వరకు రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తల ఆవేదన, పార్టీ బలోపేతం అంశాలపై చర్చించేందుకు త్వరలో ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మతో సమిష్టి భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ భేటీ ద్వారా జనసేన శ్రేణులకు న్యాయం జరిగేలా స్పష్టమైన హామీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలను పటిష్టం చేయడం, గెలుపు సాధించే సామర్థ్యం ఉన్న నాయకులను గుర్తించడం ద్వారా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఐకమత్యంతో, క్రమశిక్షణతో పనిచేస్తేనే జనసేనకు ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ సమన్వయ సమావేశం రాప్తాడు జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని కార్యకర్తలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని, స్థానిక ఎన్నికల్లో జనసేన జెండాను గర్వంగా రెపరెపలాడించాలనే సంకల్పంతో ముందుకు సాగుతామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, క్రియాశీలక జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
