*నేర రహిత అర్బన్ జిల్లా లక్ష్యంగా కృషి చేస్తున్నాం*
*అరాచక శక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.*
*అల్లరి మూకలపై నేరప్రవృత్తి గల వారిపై ఉక్కుపాదం మోపుతున్నాం*
*గంజాయి, గుట్కాల వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక టీమ్ తో పర్యవేక్షిస్తున్నాం*
*ప్రజలకి 24/7 అందుబాటులో ఉంటున్నాం.*
*సైబర్ నేరాలపై ప్రజలు అవగాహనతో ఉండాలి.*
గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అబ్దుల్ హఫీజ్ గారు
గుంటూరు అర్బన్, (జనస్వరం) : సమస్యాత్మక ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరగాళ్ల పాలిట సింహస్వప్నంలా మారిన గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ అబ్దుల్ హఫీజ్ గారిని మంగళవారం జిల్లా కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు ఆళ్ళహరి కలిసి అభినందనలు తెలియజేశారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఆకతాయిలకు, అరాచక శక్తులకు నిలయంగా ఉండే కొన్ని నగర శివారు ప్రాంతాలపై సైతం దృష్టి సారించి యస్పీ హఫీజ్ గారు స్వయంగా పర్యటించటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆళ్ళ హరి అన్నారు. ఒకవైపు సైబర్ నేరగాళ్లు మరోవైపు మాదకద్రవ్యాల, మందుబాబుల ఆగడాలు వీటికి తోడు ఆకతాయిల అల్లర్లు ఇలా ఎన్నో సవాళ్ళను ఎదురుకుంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపటంలో యస్పీ హఫీజ్ గారు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం అన్నారు. నేర నియంత్రణలో భాగంగా పోలీస్ ఔట్ పోస్ట్ లు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా శ్రీనివాసరావుతోటలోనూ పోలీస్ ఔట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలని, మందుబాబులకు నిలయమైన రాఘవయ్య పార్కు ప్రాంతంలో ప్రతీరోజూ పెట్రోలింగ్ నిర్వహించాలని యస్పీ హఫీజ్ గారిని ఆళ్ళహరి కోరారు. ఈ సందర్భంగా యస్పీ హఫీజ్ గారు మాట్లాడుతూ ప్రజలకి, ప్రజల జీవన విధానానికి ఇబ్బంది కలిగించే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, నేర రహిత అర్బన్ జిల్లా లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. అల్లరి మూకలపై, నేరప్రవృత్తి గల వారిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటూ తోక జాడించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గంజాయి, గుట్కాల వంటి మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక టీమ్ తో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడన్నా మాదకద్రవ్యాల నిల్వలు ఉన్నట్లు సమాచారం రాగానే దాడులు చేస్తున్నామన్నారు. ప్రతీక్షణం పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకం అవటంతో నేర నియంత్రణలో సత్ఫలితాలు వస్తున్నాయని ఈ క్రమంలో ప్రజల సహకారం మరువలేనిదని యస్పీ హఫీజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆళ్ళహరి యస్పీ హఫీజ్ గారికి మాజీ రాష్ట్రపతి ఏ పీ జే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు.