హన్మకొండ, (జనస్వరం) : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల, గ్రామీణ ప్రాంతాలలో చేతికందిన వరి ధాన్యం అమ్ముదామని రోడ్లపై కల్లాలో ఉంచి రాత్రనక, పగలనక కల్లాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. వర్షాకాలంలో ఆరు నెలల కాలం కష్టించి పండించిన పంటను అమ్ముదామంటే ఇంకా ధాన్యం కొనుగోల కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం, అకాల వర్షాలతో ఆగమౌతున్న ధాన్యం రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ రైతుల జీవితాలతో చెలగాటమడుతోందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ ఆకుల సుమన్ తీవ్రంగా విమర్శించారు. గత రెండు రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాసంగి వరి సాగు వడ్లు కొనుగోలుపై చేతులెత్తేయడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వర్షాకాలం ధాన్యంతో పాటు యాసంగి వడ్లు కూడా చివరి గింజ వరకు ప్రభుత్వాలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.