ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గంలో చేజర్ల మండలంలోని చేజర్ల, గొల్లపల్లి, చల్లపనాయుడుపల్లికి చెందిన ఎస్సీ కాలనీలలో, విద్యా నగర్ లోని N.B.K.R. కళాశాల పూర్వ విద్యార్థుల (N.R.I) ఆర్థిక సహకారంతో వరదల కారణంగా దెబ్బతిన్న 100 నిరుపేద కుటుంబాలకు బియ్యం బస్తాలు మరియు నిత్యావసర సరుకులను, ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు రావడం సహజమని కానీ వరదల కారణంగా ఏర్పడిన నష్టాన్ని నివారించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలియజేశారు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కనీవినీ ఎరుగని రీతిలో ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలు నీటి ముంపుకు గురయ్యాయని ఈ సందర్భంగా తెలియజేశారు. వారికి పరిపాలన అంటే ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, నవరత్నాల పేరుతో ప్రజలకు పంచి, వై. ఎస్. ఆర్. సి .పి పార్టీ యొక్క ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడమే అనుకుంటుంది. ఈ క్రమంలో ప్రజల పాలిట ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టుల భద్రతను గాలికి వదలడం జరిగింది. ఈ కారణంగా గత సంవత్సరం పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకొనిపోయి, అపారమైన ఆస్తి నష్టం సంభవించింది. ఈ సంవత్సరం కడప జిల్లాలో పించా ప్రాజెక్టు మరియు అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకొనిపోయి అపారమైన ఆస్తి మరియు ప్రాణ నష్టాలు సంభవించడం జరిగింది. గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా సోమశిల ప్రాజెక్టు ముందుభాగంలో 40 అడుగుల గోతులు పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ప్రాజెక్టు సేఫ్టీ రివ్యూ కమిటీ ఈ గోతులను సందర్శించి వీటికి వెంటనే మరమ్మతులు చేయకపోతే ప్రాజెక్టు ప్రధాన కట్టడానికి పెను ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని తెలపడం జరిగింది. ఈ నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడం జరిగింది. ప్రజల ధన, మాన, ప్రాణాల భద్రతతో కూడుకున్న ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ, ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాలను వెంటనే మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దున్నపోతు మీద వాన పడ్డ చందంగా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఇదే విధంగా గత సంవత్సరం వచ్చిన వరదల కారణంగా కడప జిల్లాలో పింఛా ప్రాజెక్టు మరియు అన్నమయ్య ప్రాజెక్టు పాక్షికంగా దెబ్బతిన్న జరిగింది. వాటికి కూడా ఎటువంటి మరమ్మతుల చేయని కారణంగా, ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఈ ప్రాజెక్టులు పూర్తిగా కొట్టుకొని పోవడం జరిగింది. నెల్లూరు జిల్లా వాసుల తలరాతలు బాగున్న కారణంగా సోమశిల జలాశయానికి ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. జరగరాని పరిణామం జరిగి ఉంటే సుమారు రెండు లక్షల మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే ఉండేది. ఇవే కాకుండా వాల్టా చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా యధేచ్ఛగా భారీ యంత్రాలతో పెన్నా నదీ గర్భంలో ఇసుకను తవ్వి వాటి రవాణా నిమిత్తం పెన్నా నది కరకట్టను ధ్వంసం చేయడం జరిగింది. భారీగా పెన్నా నది గర్భంలో ఏర్పడిన గుంటల కారణంగా పెన్నా నది ప్రవాహ దిశను మార్చుకుని బలహీనంగా ఉన్న కరకట్టల ద్వారా గ్రామాల్లోకి ప్రవేశించడంతో జరిగింది. తద్వారా నది పరివాహక ప్రాంత గ్రామాల్లో భారీ విధ్వంసం సంభవించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని దెబ్బతిన్న సోమశిల జలాశయానికి వెంటనే మరమ్మతులు చేయాలని నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక తవ్వకాలను ఆపాలని, దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మరియు పంట నష్టాలను అంచనావేసి, నష్టపోయిన ప్రతి అన్నదాతకు తగిన ఆర్థిక సహాయం అందించాలని జనసేన పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుందని అన్నారు.