విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలి – జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

   విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలి అంటే వైసీపీ ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. వారం రోజులలోపు స్టీల్ ప్లాంట్ ని ఎలా ఆపబోతున్నారో స్పష్టమైన ప్రకటన చేసి అఖిల పక్షం ద్వారా సమస్య తీవ్రతను కేంద్రానికి తెలియచేయాలన్నారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి పిలుపు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో నిర్వహించిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ – నిర్వాసితుల ఐక్య వేదికల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ వేలమందితో సాగిన ర్యాలీతో శ్రీ పవన్ కల్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి వైసీపీ నాయకులకు పిలుపు ఇస్తున్నాను. మీరు అఖిలపక్షాన్ని పిలవాలి. వారం రోజుల లోపు ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పార్లమెంటులో మాట్లాడుతాం. అవసరం అయితే కేంద్రం మీద పోరాడి ఒప్పించుకోవాలి. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు సాధించుకుంటామని చెప్పండి. అలా కాకుండా కల్లబొల్లి కబుర్లు చెబితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఈ అంశాన్ని మీరు ముందుకు తీసుకువెళ్లపోతే మాత్రం రాబోయే రెండేళ్లు మీకు గడ్డు కాలం తప్పదు. మీ వద్ద 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేన ఎమ్మెల్యేతో కలిపి.22 మంది ఎంపీలు ఉన్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ టీడీపీని కూడా కలుపుకుంటే 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు కలసి ఒక కార్యచరణ ప్రకటించండి. మేము అండగా ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా కలసి నడుద్దాం. విశాఖ ఉక్కును కాపాడుకుందాం.

పోరాటాలు చేయకుండా…

దీనిని సీరియస్ గా తీసుకోని పక్షంలో ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పోరాటం చేస్తున్న పెద్దలు ఒక కార్యాచరణ ప్రకటించండి. ప్రతి జిల్లా ప్రజల ముందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ మనకు ఎంత ముఖ్యమో తీసుకువెళ్లండి. వైసీపీ ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకువద్దాం అనే అంశం మీద చర్చించండి. మన పోరాటాలు మనం చేయకుండా కేంద్రాన్ని నిందించడం ఏం లాభం. నిర్మోహమాటంగా మాట్లాడగలను నాకేం ఇబ్బందులు లేవు. ఎందుకంటే కేంద్రం దగ్గరకు వెళ్లి నేను డబ్బులు అడగను, పదవులు అడగను. కాంట్రాక్టులు అడగను. ఏ రోజు కేంద్రంలోని పెద్దలను కలసినా ప్రజా క్షేమం కోసమే కలుస్తాను. మా వాళ్లకు 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వమని అడుగుతాను.

విశాఖ ఉక్కు సాధన చరిత్ర నేటి తరానికి తెలియాలి :

ఉక్కు కర్మాగారం దేశ ఆర్ధిక అభివృద్ధికీ, మౌలిక వసతుల కల్పనకు అవసరం. ఉక్కు లేకపోతే దేశం ముందుకు వెళ్లదు. ఒకసారి విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం మీరు చూసిన కష్టాలను, అసలు పరిశ్రమ ఎలా ప్రారంభం అయ్యిందన్న విషయాలు ఉద్యమానికి మద్దతుగా ఇక్కడికి వచ్చిన నేటి తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం విపరీతమైన భావోద్వేగాన్ని రేపే నినాదం. కులాల కుంపట్లు, వర్గాల పోరుతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని అన్నింటికీ అతీతంగా ఆ ఒకే ఒక్క నినాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. అదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 1963లో నాటి గనులశాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం గారు భారత దేశానికి ఉక్కు కర్మాగారం అవసరం ఉంది. సముద్ర తీరాన్న దాన్ని నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పి వెళ్లిన తర్వాత ఆంధ్రులంతా ఆనందించారు. రాష్ట్రానికి ఉక్కు కర్మాగారం రాబోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఎదగబోతోంది అని. మొదట మాటిచ్చి తర్వాత ఇక్కడ కాదు అని కేంద్రం మాట మార్చినప్పుడు నాడు తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీ అమృతరావు గారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి నిరాహార దీక్ష చేపట్టారు. దానికి మద్దతుగా ఆంధ్ర విశ్వ విద్యాలయం విద్యార్ధులు అండగా నిలబడ్డారు. ఉద్యమం ఉగ్ర రూపం దాల్చడం, తీవ్ర స్థాయికి వెళ్లడం, రైల్ రోకోలు, పోలీసుకాల్పుల నడుమ 32 మంది యువకులు చనిపోయారు. పీలేరు నుంచి పలాస వరకు, విశాఖ నుంచి వరంగల్ వరకు 32 బలిదానాలయ్యాయి. అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 67 మంది ఎమ్మెల్యేలు 7 మంది ఎంపీలు రాజీనామాలు చేశారు. అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. 1971లో శంకుస్థాపన జరుపుకుంది. 1992లో దాదాపు 3 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం వచ్చాక నాటి ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారు జాతికి అంకితం చేశారు. రెండు దశాబ్దాల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ రూ. 6000 కోట్ల లాభాన్ని చూసింది. రూ. 40 వేల కోట్లు కేంద్ర, రాష్ట్రాలకు టాక్సులు కట్టింది. 16 వేల మందికి శాశ్వత కార్మికులకు, 18 వేల పైచిలుకు కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి ఇచ్చింది. పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. స్టీల్ ప్లాంట్ కోసం 22 వేల ఎకరాలు, మనుషులు జీవిస్తున్న 64 గ్రామాలను ఖాళీ చేయించారు. ఈ రోజుకీ స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన భూములకు పరిహారం అందలేదు. వారి కుటుంబాల దీనస్థితిని చూస్తే బాధ కలుగుతుంది. ఒక్కోసారి తినడానికి తిండి లేక దేవాలయాలకు వెళ్లి ప్రసాదాలతో కడుపు నింపుకునే కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడేమో ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉంది ప్రైవేటీకరించబోతున్నాం అని ప్రకటించారు. ఆ వార్త అందరితో పాటు నాకు బాధ కలిగించింది.

వైసీపీ రాజకీయ పరిశ్రమలే లాభాల్లో ఉన్నాయి

నా వరకు మనసావాచా ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని కోరుకుంటా. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఖాయిలా పడకూడదు. అభివృద్ధిలోకి వెళ్లాలని కోరుకుంటా. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అన్న వెంటనే శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో కలసి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి వినతిపత్రం ఇచ్చాము. విశాఖ ఉక్కు పరిశ్రమని మిగతా పరిశ్రమల్లా చూడవద్దని, ఇది ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశమనీ పెద్ద మనసుతో ఆలోచించాలని కోరగా సావధానంగా విన్నారు. నష్టాలు ఉన్నాయి. కాదనడం లేదు. అలా అనుకుంటే ఏ పరిశ్రమకు నష్టాలు లేవు. ఏ వ్యాపారంలో నష్టాలు లేవు. నష్టాలు లేని వ్యాపారం ఏదైనా ఉంది అంటే అది ఒక వైసీపీ రాజకీయ పరిశ్రమ మాత్రమే.

ప్రజల కష్టాలు వారికి అర్ధం కావు

దేశ అభివృద్ది కోసం, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ రంగంలో సంస్థలను నిర్మిస్తారు. వీటిని స్థాయిని బట్టి మహారత్న, నవరత్న, మిని రత్న, మినీ రత్న 2 గ్రేడ్ చేస్తారు. 3 నుంచి 5 సంవత్సరాల్లో వీటి నుంచి వచ్చే లాభ నష్టాల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయిస్తారు. 2017లో డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరించబోయారు. చిన్నపాటి నష్టం ఉందని ప్రైవేటీకరించబోతే ఒక యువకుడు ఉద్యోగం పోతే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడి బలిదానం నన్ను ఉద్యమంలోకి తీసుకువచ్చింది. ఆ రోజున అన్ని సంఘాలు నిలబడ్డాయి. ఈ రోజు డ్రెడ్జింగ్ కార్పోరేషన్ షేర్లు స్టాక్ మార్కెట్లో రూ.300 పలుకుతోంది. కంపెనీ నిలబడింది. పోరాటాల వల్లే ఇది సాధ్యపడింది. ఆ రోజున ఒత్తిడి చేయడానికి కేంద్రం వద్దకు వెళ్ల లేదు. ఇక్కడ పోరాడి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే… నాటి ముఖ్యమంత్రి ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వం మీదే బాధ్యత పెడితే కష్టం. మనవాళ్ల కష్టాలు కేంద్రానికి ఏమి తెలుస్తాయి. ఢిల్లీలో కూర్చున్న మనవాళ్లు వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వివరించాలి.

కోవిడ్ సమయంలోనూ రక్తం ధారపోశారు

విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేవు అని రాష్ట్ర విభజన సమయంలో ఒక్క ఎంపీ కూడా యూపీఎ ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోయారు? ఆంధ్రాలో ఉన్న 25 మంది ఎంపీలు విశాఖకు సొంత గనులు ఇవ్వండి అని ఎందుకు గొంతెత్తలేదు? నాయకులకు ప్రజల కష్టాలు అర్ధం కావు. వారికి వారి పదవులు, వారి కాంట్రాక్టులు ముఖ్యం. ప్రజల కన్నీళ్లు ముఖ్యం కాదు. అందుకే వారి మనసులోంచి మాటలు రావు. స్టీల్ ప్లాంట్ కి పొలాలు ఇచ్చిన ప్రజలు ఆకలితో గుడిలో ప్రసాదాలు తినే వారి కష్టాలు అర్ధం కావు. నామటుకు నేను ప్రజలకు మోసం చేయను. నేను ఓడిపోయినా ఇక్కడే నిలబడి ఉన్నాను.నేను ఓటమిని చూసి పారిపోను. ఉక్కు మనిషి సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి రోజున ఉక్కు సంకల్పంతో మాట్లాడుతున్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలి. దాని కోసం అన్ని పార్టీలు కలిసి రావాలి.

మీ భవిష్యత్తు కోసం మాత్రం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులు కూడా పరిశ్రమల మీద ప్రభావం చూపినప్పుడు ప్రభుత్వ సహకారం అవసరం. ముడి సరుకు, సొంత గనులు ఉన్న పరిశ్రమలకు తిరుగు లేదు. విశాఖ బ్రాండ్ వాల్యూ గురించి మాట్లాడాలి అంటే కరోనా కష్టకాలంలో కూడా ఇక్కడ కార్మికులు రక్తాన్ని ధారపోసి రూ.కోట్ల లాభాలు తెచ్చిపెట్టారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక ప్రజలు చనిపోతుంటే ప్రమాదాలు జరుగుతాయని తెలిసి కూడా రిస్కు తీసుకుని స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటూ వచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వానికీ బాధ్యత ఉంది

ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం అడగబోయే ముందు రాష్ట్ర ప్రభుత్వాల్ని కూడా బాధ్యుల్ని చేయాలి. అలా చేయకపోతే కేంద్ర ప్రభుత్వానికి మనం ఎందుకు గొడవ చేస్తున్నామో కూడా అర్ధం కాదు. రాష్ట్ర విభజన జరుగుతున్నా మీ ఎంపీలు, మీ నాయకులు ఏమీ మాట్లాడరని ఢిల్లీలో ఉన్న పెద్దలు చెబుతూ ఉంటారు. వారికి కాంట్రాక్టులు, డబ్బులు ఇస్తే సరిపోతుంది. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడరు. ఏ రోజూ ఎంపీలు ప్రజా సమస్యల గురించి మాట్లాడకుంటే ఎవరు మాత్రం ఎం చేస్తారు. ఇలాంటి ఎంపీలను ఎన్నుకుంటే అన్యాయం జరగక న్యాయం ఎలా జరుగుతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఒక్క ఎంపీ అయినా మా స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వండి అని అడిగితే కేటాయించేవారేమో. ఓటుకు నోటు ఇచ్చి ఓట్లు వేయించుకుని గెలిచి వెళ్లిపోతారు. తిరిగి ఎన్నికలు వచ్చే వరకు కనబడరు. సమస్య వచ్చినప్పుడు నిలబడడానికి ఓడి పోయిన మేమే రావాలి. మేము నిలబడతాం.. న్యాయం జరిగే వరకు నిలబడతాం.

విశాఖ ఉక్కు ఎవరి దయాదాక్షిణ్యాల మీద వచ్చింది కాదు.. పోరాడి సాధించుకున్నది.. ఎవడో పడేస్తే రాలేదు.. 32 మంది బలిదానాలు.. యువకులు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.. పీలేరు పలాస విశాఖ వరంగల్ వరకు ప్రాణాలు కోల్పోయారు. విద్యార్ధుల ప్రాణ త్యాగాలు, నాయకులు త్యాగాలతో వచ్చింది.. విశాఖ స్టీల్ ప్లాంటు పోరాడి సాధించుకున్నది. ఆత్మగౌరవంతో బలిదానాలతో సాధించుకున్నది. ఎవరో పడేస్తే వచ్చింది కాదు.. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం ఆంధ్రుల ఆత్మగౌరవం.. ఆత్మగౌరవం లేని బతుకు చనిపోవడం బెటర్ కదా.. కొంత మంది అమ్మేసుకుంటారు.. మనకి ఆత్మగౌరవం ఉంది..2021 ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తావన వచ్చినప్పుడు 20 ట్రేడ్ యూనియన్లు ఐక్యంగా పోరాడాయి. ఫలితంగానే ఇన్ని రోజులు పరిశ్రమ నిలబడింది. పోరాటం చేయకుంటే సర్క్యూట్ హౌస్ మాదిరి అమ్మేసేవారు.

బిల్లులకు మద్దతిస్తున్నారుగా…

మాట్లాడితే నేటి వైసీపీ నాయకులుగానీ, నాటి టీడీపీ నాయకులుగాని కేంద్రం తమ మాట వినదని చెబుతారు. మీకు కాంట్రాక్టులు కావాలి, పదవులు కావాలి, బెయిల్ రావాలంటే కేంద్రం మీ మాట ఎలా వింటుంది? ఒక్క ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని లేని నా మాట కేంద్ర హోంశాఖ మంత్రి సావధానంగా విన్నప్పుడు 22 మంది ఎంపీలు ఉన్న మీ మాట ఎందుకు వినరు? మాట్లాడితే మాకేం సంబంధం లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసేశాం అని చేతులు దులుపుకుంటే కుదరదు. అలాంటి కాకమ్మ కబుర్లు చెబితే కుదరదు. విభజన సమయంలో ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే ఇదే కథలు చెప్పారు మేము విన్నాం. ఇప్పుడు కూడా మా చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టకండి. వైసీపీ నాయకులు కేంద్రం మా మాట వినదు. మోదీ గారు మా మాట లెక్క చేయరు. వైసీపీ ఎంపీలు వారికి అవసరం లేదు అని చెబుతున్నారు. మరి వైసీపీ ఎంపీలు అవసరం లేనప్పుడు మీరు సీఏఏకి ఎందుకు మద్దతు ఇచ్చారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్రంతో ఉన్నారుగా? వ్యవసాయ బిల్లుకు ఢిల్లీలో మద్దతు ఇచ్చి రాష్ట్రంలో భారత బంద్ కి మద్దతిస్తారు. విభజన సమయంలో ఉన్న పాడు రాజకీయాలే మీరు చేస్తున్నారు. కశ్మీర్ బిల్లు లాంటి చాలా బిల్లులకు వైసీపీ కేంద్రానికి మద్దతు ఇచ్చింది. అలాంటప్పుడు వైసీపీ స్టీల్ ప్లాంట్ కి గనులు కావాలి అని ఎందుకు బలంగా అడగదు?

స్టీల్ ప్లాంట్ గురించి అడిగే దమ్ము వైసీపీకి లేదు

ప్రజల కష్టాలు తెలియదు వారికి. రైతులు పోతే పోనీ, నిర్వాసితులు పోతే పోనీ, ఆంధ్రుల ఆత్మగౌరవం పోతే పోనీ.. మా వైసీపీకి మాత్రం డబ్బులు రానీ రానీ.. కాంట్రాక్టులు రానీ రానీ. మేం నిలబడం జనం పోతే పోనీ. మేము లేఖలు ఇచ్చేశాం అంటారు. ఎన్ని సార్లు ఇచ్చారు లేఖలు. విభజన సమయంలో మీ లేఖల కథలు మేము చూడలేదా? ఏదైనా అంటే భారతీయ జనతా పార్టీకి మా అవసరం లేదు. వారంటే భయం అంటారు. రాజ్యసభ చైర్మన్ మీద అభాండాలు ఎలా వేశారు. సీజేఏ జస్టిస్ బాబ్దేగారికి లేఖ ఎలా రాశారు. ఒక చీఫ్ జస్టిస్ కాబోయే వ్యక్తి మీద ఫిర్యాదు ఎలా చేశారు. అంటే కీలకమైన వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులతో గొడవ పెట్టుకునే ధైర్యం వైసీపీ నాయకులకు ఉంది. కానీ వైసీపీ స్టీల్ ప్లాంట్ అడిగే దమ్ము ధైర్యం మాత్రం లేదు.

ఫిబ్రవరి 6 నుంచి సెప్టెంబర్ 12 వరకు స్టీల్ ప్లాంట్ కోసం వారు చేసిన కార్యక్రమాల జాబితా చూస్తే.. స్టీల్ ప్లాంట్ కోసం లేఖలు రాశాం. విశాఖ ఉక్కుకు సొంత గనులు కావాలని లేఖలు రాశాం. ఎంపీల ద్వారా మెమొరాండాలు ఇచ్చాం. అసెంబ్లీలో తీర్మానాలు చేశాం. అశీల్ మెట్ట నుంచి గాజువాక దాకా పాదయాత్రలు చేశాం. ఇంకా కోపం వస్తే మహా పాదయాత్రలు చేస్తాం అని ప్రకటన ఇచ్చారు. ఉద్యమిస్తాం.. పోరాడుతాం… అవసరం అయితే ఎంపీలంతా రాజీనామా చేస్తామని చెప్పారుగా ఎందుకు చేయలేదు? మీ భీమిలి ఎమ్మెల్యే కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఊగిపోతూ చెప్పారు. ఎందుకు ఉద్యమించడం లేదు? అంటే వైసీపీ మాటలకు అర్ధాలు వేరు. వారు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మద్యం అమ్ముతామని అర్ధం. విద్యార్ధులకు అండగా నిలబడతామంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలు మూసేసి వారి ఆస్తులు స్వాధీనం చేసుకుని రెండు లక్షల మంది విద్యార్ధుల్ని రోడ్డున పడేస్తామని అర్ధ.. రైతులకు రూ. 12,500 ఇస్తామంటే కేంద్రం ఇచ్చే ఆరు వేలు కలుపుకుని అని అర్ధం. అందరికీ ఆరోగ్య శ్రీ అంటే కోవిడ్ వచ్చి చస్తున్నాం అని చెబితే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి తగ్గిపోతుందని సలహా ఇస్తారు. మేమే ఫీజులు కడతాం అంటే కట్టండి అంటే కొడతామని అర్ధం. జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే జాబులు లేకుండా చేస్తామని అర్ధం. మొత్తం లిస్టు తీస్తే తెల్లవారుజాము వరకు అవుతుంది.

మీ బెస్ట్ ఫ్రెండ్ టీడీపీని పిలవండి

ఈ సభా ముఖంగా వైసీపీకి ఒక్కటే చెబుతున్నా.. అఖిలపక్షం వేయండి.. దానికి నిర్వాసితుల సంఘాలను, ట్రేడ్ యూనియన్ల పిలవండి. మేధావులను పిలవండి. కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సీపీఎం నాయకుల్ని పిలవండి. మీ బెస్ట్ ఫ్రెండ్ టీడీపీ వాళ్లను పిలవండి.మీకు నేనంటే ఇష్టం లేదని తెలుసు అయినా నన్ను పిలవండి. మా నాయకుల్ని, జనసైనికుల్ని పిలవండి. మేమంతా వస్తాం. ఇంత మంది కలసి వచ్చి పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి దాని తీవ్రత అర్ధం అవుతుంది. పోరాటాలే చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేసింది. మీరు తప్పు చేశారు అంటే కుదరదు.

చివరిగా ఒక్కటే చెబుతున్నా విశాఖ ఉక్కు కోసం చేసిన 32 మంది బలిదానాలు, శ్రీ అమృతరావు గారి త్యాగాలను వృథా కానివ్వం. ఆంధ్రా వాళ్ళుకు దేశ భక్తి ఎక్కువ.. అందుకే నేను జైహింద్.. భారత్ మాతాకి జై అంటూ సభలకు ముగింపు పలుకుతా.. కానీ 1972 జై ఆంధ్ర ఉద్యమానికి, విశాఖ ఉక్కు సాధించడానికి రెండు స్లోగన్స్ సహకరించాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. జై ఆంధ్ర.. జైజై ఆంధ్ర.. ఈ నినాదాలు చేస్తే దేశం మీద గౌరవం లేనట్టు కాదు. అన్నంపెట్టిన నేలకు గౌరవం ఇవ్వడం అవసరం. ఓట్లు ఎవరికి వేసినా ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో ప్రతి తెలుగు వాడు ఏకం కావాలి” అన్నారు.

ముఖ్యమంత్రి స్పందించరేం: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

32 మంది బలిదానంతో, 64 గ్రామాల రైతుల 22వేల ఎకరాల వితరణతో ఆంధ్ర రాష్ట్ర భావితరాల కోసం ఆవిర్భవించిన విశాఖ ఉక్కును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పోరాటం. ప్రజల కోసం నిలబడాల్సిన సందర్భం. ఉద్యోగులు, కార్మికులు విశేష కృషి చేసి విశాఖ స్టీల్ ప్లాంటు ఉత్పత్తిని పెంచారు, లాభాల్లోకి మళ్లించారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటోందో బాధ కలిగిస్తోంది. మనం ఢిల్లీ పెద్దలకు పరిస్థితిని వివరించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయాలి. ఇందుకు అందరూ సహకరించాలి. విశాఖ ఉక్కు ప్రైవేటుపరానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న వారం రోజుల్లోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లి శ్రీ అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఆత్మత్యాగాల పునాదిపై నిర్మితమైన విశాఖ ఉక్కు విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, దీనిని కేవలం స్టీల్ ప్లాంటుగానే చూడవద్దని, తెలుగువారికి దీనితో విడదీయరాని బంధం ఉందని వివరించారు. సానుకూలంగా స్పందించిన ఢిల్లీ పెద్దలు అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కూడా మీలో ధైర్యం నింపడానికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడకు వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు ఎందుకు పోరాటానికి అండగా నిలబడటం లేదని శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రశ్నించారు. ఢిల్లీ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ కోరినట్లు అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీ తీసుకెళ్లడం లేదు. ప్రధాన మంత్రిని ఎందుకు కలవడం లేదు. ఆదుకోమని ఎందుకు కోరడం లేదు. గంగవరం పోర్టులో పది శాతాన్ని అమ్మినట్లు విశాఖ ఉక్కును కూడా తెగనమ్ముతారా? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించి, అందరినీ కలుపుకొని వెళ్లి ప్రధానితో మాట్లాడాలి. ఇక్కడి వారికి భరోసా కల్పించాలి. జనసేన పార్టీ మీ వెంటే ఉంటుంది. మీకు అండగా ఉంటుంది అని ఉద్యోగులకు, కార్మికులకు, నిర్వాసితులకు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో పార్టీ పి.ఏ.సి. సభ్యులు శ్రీ కోన తాతారావు, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పంతం నానాజీ, శ్రీ పితాని బాలకృష్ణ, పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి.శివశంకర్, శ్రీ సత్య బొలిశెట్టి, శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి పాలవలస యశస్వి, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నేతలు శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పరుచూరి భాస్కర రావు, శ్రీ పి.వి.ఎస్.ఎన్.రాజు, శ్రీ పంచకర్ల సందీప్, శ్రీమతి పి.ఉషాకిరణ్, శ్రీ బి.నాయకర్, శ్రీ ఈవన సాంబశివప్రతాప్, డా.బొడ్డేపల్లి రఘు, శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, శ్రీ కందుల దుర్గేష్, శ్రీ టి.సి.వరుణ్, డా.హరిప్రసాద్, శ్రీ పోతిన మహేశ్, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ షేక్ రియాజ్, శ్రీ గాదె వెంకటేశ్వరావు, శ్రీ గడసాల అప్పారావు, శ్రీమతి దుర్గా ప్రశాంతి శ్రీ బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way