తుని, (జనస్వరం) : రాష్ట్రంలో టిడిపి, వైసిపి దొంగ దీక్షలు నాటకాలు ఆపి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు దృష్టి సారించాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక బాలాజీ లాడ్జ్ ఆవరణంలో బుధవారం నిర్వహించిన జనసేన పార్టీ విసృత స్థాయి సమావేశంలో పలువురు యువకులు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రలో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని, గెలుపే లక్ష్యంగా జన సైనికులు కృషి చేయాలని పిలువునిచ్చారు. రాష్ట్రములో మరో రెండేళ్ల తర్వాత తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఆ దిశగా జనసేన నాయకులు కృషి చేయాలని పిలువు నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జనాగ్రహ పేరుతో దొంగ దీక్షలు చేస్తుందని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. పేద ప్రజల దగ్గర నుంచి రేషన్ కార్ట్డులు, పింఛన్లు కార్డులు తొలగించడం సరికాదని అన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. విద్యుత్తు, పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంపు వ్యతిరేక పోరాటాలు చెయ్యాలని జనసైనికులు ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడైతే రోడ్లు శిధిలావస్థలో ఉన్నాయో అటువంటి చోట్ల శ్రమదానం చేయాలని పార్టీ నాయకులకు పిలుపు నిచ్చారు. 2024నాటికి జిల్లా అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ జెండా ఎగురవేయాలని, జనసైనికులు ఇప్పటి నుంచే గ్రామాల్లో కిందిస్థాయి నుంచి కృషి చేయాలి అన్నారు. త్వరలోనే మత్స్యకారులకు అండగా తొండంగి మండలం దానవాయిపేటలో సభ ఏర్పాటు చేస్తామని, మత్స్యకారులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్ , దారకొండ వెంకటరమణ, భాస్కర్ వాసురెడ్డి శివ, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, సురేష్, కాశీవిశ్వేశ్వర తదితరులు పాల్గొన్నారు.