• అన్ని రాష్ట్రాల పోలీసులు ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపుతున్నారు
• వైసీపీ పాలనలో గంజాయి సాగు పెరిగిపోయింది
• రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారుతున్నా సీఎం నుంచి స్పందన లేదు
• గంజాయి స్మగ్లర్లు పోలీసులు మీద దాడులు చేస్తున్నారు
• గంజాయి సాగు ధ్వంసానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి
• విజయవాడలో మీడియా సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
విజయవాడ, (జనస్వరం) : దేశం మొత్తం అన్నపూర్ణగా చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గంజాయి ఆంధ్ర, డగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మారిపోవడం అత్యంత బాధాకరమని జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రతిష్ఠ రోజు రోజుకీ దిగజారుతుందన్న ఆవేదనలో ప్రజలు ఉంటే సీఎం జగన్ రెడ్డి నుంచి కనీస స్పందన లేకుండా పోయిందన్నారు. గంజాయి, డ్రగ్స్ వ్యవహారం విద్యార్థులను కూడా ప్రభావితం చేసే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు. గంజాయి సాగు, అక్రమ రవాణా విషయంలో చూసీచూడనట్లు ఉంది తప్పులు చేసే టీడీపీ ప్రతిపక్షంలో కూర్చుందనీ, వైసీపీ అంతకు మించి ఎక్కువ నిర్లక్ష్యంతో మరిన్ని తప్పులు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గంజాయి స్థావరాలను ధ్వంసం చేయాలని డిమాండ్ చేశారు. గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ “రాష్ట్రంలో గంజాయి సాగు నిర్మూలన మీద ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. దేశంలో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ మూలాల పేరెత్తితే అక్కడున్న పోలీసు అధికారులు ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్, విశాఖ నుంచి వస్తుందని చెబుతున్నారు.
• ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎందుకు ఖండించడం లేదు?
“అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని డగ్స్ ఆంధ్రగా మార్చారన్న ఆవేదన ప్రజల్లో ఉంది. సీఎంలో మాత్రం చలనం కనబడడం లేదు. బాధ కలగడం లేదు. మాట్లాడితే మీడియా ముందుకు వచ్చే ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ వ్యవహారంపై ఒక్క సమావేశం పెట్టడం లేదు. గంజాయిని నిర్మూలిస్తాం, సాగును ధ్వంసం చేస్తాం. సరిహద్దులు దాటకుండా చర్యలు తీసుకుంటాం అని ఎక్కడా చెప్పడం లేదు. అన్ని రాష్ట్రాల పోలీసులు ప్రెస్ మీట్లు పెట్టి గంజాయి అక్రమ రవాణా విషయంలో ఏపీ వైపే వేలెత్తి చూపుతున్నారు. మరి సజ్జల రామకృష్ణా రెడ్డి ఎందుకు ఖండించడం లేదు. ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం” అని ఆయన అన్నారు.
• స్మగ్లింగ్ వెనక ఉన్న బడా బాబులని చూపాలి
“సీఎం జగన్ రెడ్డి పాలనలో గంజాయి సాగు విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడా గంజాయి సాగును ధ్వంసం చేయడం లాంటి చర్యలు కనబడడం లేదు. పోలీసులు, ఎక్సైజ్ శాఖను జట్టుగా తయారు చేసి గంజాయి పంటను ధ్వంసం చేసేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాం. గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో చిన్న చిన్న నేరస్తుల్ని మాత్రమే అరెస్టు చేసి మీడియాకు చూపెడుతున్నారు. అసలైన స్మగ్లర్లు, వెనుకున్న బడా బాబుల్నీ మీడియాకు చూపించాలని డిమాండ్ చేస్తున్నాం” అని అన్నారు.
– రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యవహారాలు విద్యార్థులను సైతం ప్రభావితం చేస్తున్నాయి. “బుధవారం విజయవాడలో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి సుమారు 7 వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు, 560 మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు చెప్పడం రాష్ట్రంలో పరిస్థితులు ఏ స్థాయికి దిగజారాయో చెప్పకనే చెబుతున్నాయి. ఈ ప్రభుత్వం యువతను, విద్యార్ధులను ఎలా నిర్వీర్యం చేస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలి” అని తెలిపారు.
• దాడులు చేస్తున్నా పోలీసు సంక్షేమ సంఘం స్పందించదేం?
“అటు చూస్తే గంజాయి స్మగ్లర్లు పోలీసుల మీద కూడా దాడి చేస్తున్నారు. లంబసింగి, అన్నవరం గాలిపాడు దగ్గర పోలీసుల్ని వెంటాడి దాడి చేశారు. అసలు స్మగ్లర్లకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. వారికి ప్రభుత్వంలో ఉన్న ఏ పెద్ద మనుషుల మద్దతు ఉందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పోలీసులు మీద విచ్చలవిడిగా దాడులు జరుగుతుంటే.. ఏ రాష్ట్ర పోలీసులైనా కావచ్చు.. పోలీసు సంఘాలు ఏమయ్యాయి. ఎవరైనా ఒక మాట మాట్లాడితే విలేఖర్ల సమావేశం పెట్టే మీరు ఈ రోజు స్మగ్లర్లు, గంజాయి రవాణా ముఠాలు పోలీసుల మీద దాడి చేస్తుంటే ప్రెస్ మీట్లు ఎందుకు స్పందించటం లేదు. రాయలసీమలో వైసీపీ ఎంపీపీ భర్త సీఐ గారిని గుండెల మీద చేతులు వేసి తోసేస్తే విలేఖర్ల సమావేశం పెట్టరా? అది పోలీస్ శాఖకు అవమానం కాదా? దీని మీద పోలీస్ సంక్షేమ సంఘం స్పందించాలి” అని ప్రశ్నించారు.
• వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం
రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రోజున స్పందించారు. ఇది సామాజిక, ఆర్ధిక అంశాలతో ముడిపడి ఉన్న అంశమని చెప్పారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు పెరిగిందంటే ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఆర్థిక వనరులు, ఉపాధి అవకాశాలు లేకపోవడమే కారణం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పగలరా? వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఉపాధి అవకాశాలు లేవు. ఉద్యోగాలు లేవు. యువత పొట్టకూటి కోసం తప్పుడు మార్గాల్లోకి వెళ్తున్నారు. దీనంతటికీ వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉపాధి అవకాశాలు లేకే యువత పక్కదోవ పడుతున్నారు. క్రిమినల్స్ వలలో పడుతున్నారు” అని అన్నారు.
• సబ్ ప్లాన్ నిధులు మళ్లించుకున్నారు
“2020-2021 ఏడాదికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ. 26 వేల కోట్లు ఉంటే ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.13వేల కోట్లు మాత్రమే. ఎస్సీ, ఎస్టీల విద్యాభివృద్ధికి, ఉన్నత విద్యకి కేవలం రూ. 300 కోట్లు వినియోగించారంటే ఈ ప్రభుత్వం వారి అభివృద్ధికి ఏ స్థాయిలో కట్టుబడి ఉందో అర్ధం చేసుకోవాలి. మిగిలిన డబ్బు మొత్తం ఇతర పథకాలకు మళ్లించడం ఆ వర్గాల అభివృద్ధి మీద జగన్ రెడ్డి మీద ఉన్న చిత్తశుద్దిని తెలియ చేస్తుంది. వైసీపీ నాయకులు ఎస్సీ, ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడ గిరిజనులు ఉపాధి అవకాశాలు లేవు, మౌలిక వసతులు లేవన్న విషయాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గంజాయి అంశాన్ని కూడా ప్రస్తావనకు వచ్చింది. దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించారు” అని ఆయన అన్నారు.
• వైసీపీ కనుమరుగుకాక తప్పదు
“టీడీపీ హయాంలో కూడా గంజాయి రవాణా ఉంది. కానీ ఇంత దారుణమైన పరిస్థితి లేదు. వారు తప్పులు చేయబట్టే ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేశారు. వైసీపీ నాయకులు అంతకు మించి తప్పులు చేస్తున్నారు. 151 సీట్లు వచ్చాయి కదా మనల్ని ఎవరు అడుగుతారన్న అహంభావంతో ఉన్నారు. ప్రజలు తలుచుకుంటే చివరి ఒకటి లేచిపోతుంది జాగ్రత్త. మీరు రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితి త్వరలోనే వస్తుందని హెచ్చరిస్తున్నాం” అని అన్నారు.
• ఉత్తరాంధ్ర డాన్ మాట్లాడరేం?
డ్రగ్స్ మూలాలన్నీ ఏజెన్సీ చుట్టూ తిరుగుతుంటే ఉత్తరాంధ్ర కింగ్, సీఎం తరఫున విశాఖ ప్రతినిధి విజయసాయి రెడ్డి ఎందుకు స్పందించడం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపిస్తుంటే, ఆ మూలాలు ఉత్తరాంధ్ర వైపు కనబడుతుంటే విజయసాయి రెడ్డి ఎందుకు స్పందించడం లేదు. ఆయన మౌనంగా ఉండటం వెనక ఏవైనా బలమైన కారణాలు ఉన్నాయా? నవంబర్, డిసెంబర్ నెలల్లో గంజాయి సాగు కోతకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను, ఎక్సేజ్ శాఖను అప్రమత్తం చేసి 30 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. పంట మొత్తాన్ని ధ్వంసం చేయాలి. అలా చేయకపోతే ఈ సమాజం తీవ్రంగా నష్టపోతుంది” అని అన్నారు.
• విశాఖ ఉక్కు కోసం సీఎం కూడా బయటకు రావాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ కు 5 కోట్ల మంది ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఎంతో మంది ప్రజా ప్రతినిధుల రాజీనామాలు, 32 మంది ప్రాణ త్యాగాలతో నిర్మించబడిన ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తామంటూ కేంద్రం ముందుకు వెళ్తుంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం చూస్తే ప్రభుత్వం తరఫున ఒక లేఖ రాసి సరిపెట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా శ్రేయస్సు మీకు పట్టదా? విశాఖ ఉక్కు కోసం 1970లో 7గురు ఎంపీలు, 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ రోజు విశాఖ ఉక్కును కాపాడడం కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని పీఏసీ చైర్మన్ పర్యటనలో పరిరక్షణ కమిటీ సభ్యులు విన్నవించారు. వారి విన్నపం మేరకు ఈ నెల 31వ తేదీన పవన్ కళ్యాణ్ లక్షలాది మందితో ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలియచేయనున్నారు. నాడు కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ప్రైవేటుపరం చేయొద్దంటూ ఢిల్లీ వెళ్లి అమిత్ షాకి వినతిపత్రం సమర్పించింది కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గ్రహించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ ఒక పక్క.. జైలు, బెయిలు, వ్యక్తిగత స్వార్ధం కోసం ప్రజల్ని మభ్యపెడుతున్న జగన్ రెడ్డి మరో పక్క ఉన్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజలు గ్రహించాలి” అన్నారు.