హైదరాబాద్, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అభ్యర్థులను బరిలోకి నిలపాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారని పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ప్రతి డివిజన్, వార్డుల్లో జనసేన అభ్యర్జులను నిలబెట్టి వారి విజయం కోసం కృషి చేయాలని సూచించినట్టు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లాల అధ్యక్షులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పార్టీ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో సుధీర్ణంగా చర్చించారు. ఉదయం 11గ0. నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమీక్షా సమావేశం కొనసాగింది. జిల్లాల అధ్యక్షులు ఇచ్చిన నివేదికలను సమీక్షించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం శ్రీ కందుల దుర్గేష్, అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి. వరుణ్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డిలతో కలసి సమావేశం వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గేష్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుల వారితో జరిగిన సమీక్ష సమావేశంలో తొమ్మిది అంశాలపై తీర్మానం చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులను నియమించిన జిల్లాల్లో నవంబర్ 15వ తేదీ నాటికి పార్టీ మండలాధ్యక్షులు, మండల కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ మొత్తం 15 రోజులలో పూర్తి చేయాలని అధ్యక్షుల వారు ఆదేశించారు. త్వరలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి. పర్యటనల్లో భాగంగా అధ్యక్షుల వారు ప్రతి జిల్లాల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షిస్తారు. అనంతరం కార్యాచరణకు రూపకల్పన చేస్తారు. దీంతో పాటు జిల్లాల వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇసుక తవ్వకాలు, అక్రమ మైనింగ్, పోలీస్ శాఖకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు 144 సెక్షన్, సెక్షన్ 30లు అమల్లో ఉండడం, చిన్నపాటి వినతిపత్రం ఇవ్వడానికి కూడా పోలీసులు అడ్డగించి, ఇబ్బందులు పెట్టడం వంటి అంశాలు, శాంతి భద్రతల అంశాలను పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకువచ్చాం. ప్రభుత్వ పథకాల అమలు వ్యవహారంలో ఫించన్లు ఆపిపేయడం, రేషన్ కార్డులు తీసివేయడం, అమ్మ ఒడి వాయిదా వేయడం లబ్దిదారులకు న్యాయంగా అందాల్సిన లబ్ది రాకపోవడం వంటి అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. జిల్లాల వారీగా ప్రత్యేకంగా ఉన్న సమస్యలపై జనసేన శ్రేణులు పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే స్థానిక సమస్యల మీద పోరాటం చేయాలని, రాష్ట్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేసి ఒక నోట్ తయారు చేసి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గానికి పంపాలని అధ్యక్షుల వారు సూచించారు. దీంతో పాటు పార్టీ క్రియాశీలక సభ్యులను బలోపేతం చేసే దిశగా వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం” అన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గుంటూరు. జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వర రావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవింద రావు, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.