
కార్వేటినగరం, (జనస్వరం) : కార్వేటినగరం మండలం కార్వేటినగరం పంచాయితీ విజయమాంబాపురం అంగన్వాడీ మరియు ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉన్నదని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ తెలిపారు. పాఠశాలను సందర్శించి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984వ సంవత్సరంలో కట్టిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. 37 సంవత్సరాలుగా ఇదే భవనంలోనే పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ఇక ఏ మాత్రం కొనసాగించడానికి వీలులేని పరిస్థితిలో ఉండటం ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో పాఠశాల భవనం ఉందని, ఒకవేళ పాఠశాల వేళలో ఏదైనా ప్రమాదం జరిగితే భావిభారత భవిష్యత్ తరాలకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి పది సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు ప్రాధేయ పడుతున్నా పట్టించుకునే నాథుడే లేదని గ్రామస్తులు వాపోతున్నారు. నాడు నేడు రేపు ఇదే దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, వెంటనే స్పందించి విద్యార్థులకు పాఠశాల భవనం నిర్మించ వలసిందిగా కోరుతున్నాను. ఒక వారం రోజుల్లో గ్రౌండ్ అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలనే జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అలా చేయని పక్షంలో కార్వేటినగరం మండలంలో భిక్షాటన చేసి, దీనితో పాటు జనసేన పార్టీ సహాయం అందించి పాఠశాల భవనం నిర్మిస్తామని హెచ్చరించారు. పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యమని, ఈ సందర్భంగా పిల్లలు దైవాంశ సంభూతులు అని కొనియాడారు. వారికి అన్యాయం జరిగితే సహించేది లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన బాబు, గౌరవ అధ్యక్షులు భాను చందర్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి వెంకటేష్, కార్యదర్శులు రాజేష్, నరేష్, అన్నామలై, నియోజకవర్గ సమన్వయకర్త రాఘవేంద్ర, మరియు గ్రామస్తులు తదితురులు పాల్గొన్నారు.