అమరావతి, (జనస్వరం) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సకాలంలో చెల్లించలేకపోవడం ప్రభుత్వానికి లోపించిన ఆర్థిక క్రమశిక్షణను తెలియచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు వస్తాయనే మాటను మరచిపోయే పరిస్థితిని తీసుకువచ్చారు. ఎప్పుడు జీతాలు, పెన్షన్లు వస్తాయో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పడమే కారణం. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం నా దృష్టికి వచ్చింది. దశాబ్దాలపాటు సర్వీసు చేశాక విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకొంటారు. వృద్ధాప్యంలో వారికి వైద్య ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చులకు పెన్షన్ డబ్బులే ఆధారం. వాటిని కూడా సకాలంలో ఇవ్వకపోతే మానసికంగా వేదనకు లోనవుతారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలు తెలుసు. జీతం మీద, పెన్షన్ తోను ఆత్మాభిమానంతో జీవిస్తారు. మా నాన్నగారు ప్రభుత్వ సర్వీసు నుంచి రిటైరయ్యారు. ఆయన ఎంత ఆత్మాభిమానంతో ఉండేవారో చూసినవాణ్ణి. ఉద్యోగులు తమకు వచ్చే జీతాన్ని ప్రణాళికతో ఖర్చు చేసుకొంటారు. బ్యాంక్ లోన్ల వాయిదాలు, పిల్లల చదువుల ఖర్చులు, వైద్య అవసరాలు… ఎన్నో ఉంటాయి. నిర్దేశిత సమయానికి జీతం ఇవ్వకపోతే ఎంత కాలం వారు చేబదుళ్లతో నెట్టుకురావాలి? పోలీసు శాఖవారు నిరంతరం డ్యూటీలో ఉంటారు. వారికి 11 నెలల నుంచి టి.ఏ. కూడా చెల్లించడం లేదు. వారి సరెండర్ లీవులకు రావాల్సిన సొమ్ములు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నా దృష్టికి రావడంతోనే అనంతపురం జిల్లా కొత్తచెరువు సభలో ప్రస్తావించాను. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకూ 7 డి.ఏ.లు బకాయిపడింది. పి.ఆర్.సి. అమలు చేయడం లేదు. జీతం ఇవ్వడమే ఆలస్యం చేస్తే డి.ఏ.లు, టి.ఏ.లు, పి.ఆర్.సి.లు అడగరు… జీతం వస్తే అదే పదివేలు అనుకొంటారు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరం కంటే పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్వహణలో భాగమైన జీతభత్యాల చెల్లింపులు కూడా చేయడం లేదంటే ప్రభుత్వ ఆదాయం ఎటుపోతోంది? ప్రతి నెలా తెస్తున్న అప్పులు ఏమైపోతున్నాయి?