• ఇంటికి ఒకరు సభకు రావాలని బెదిరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
• ప్రజల విశ్వాసం కోల్పోయారు కాబట్టే బరి తెగించి బెదిరింపులకు దిగుతున్నారు
• పెన్షన్లు, రేషన్ కార్డులు తొలగింపుపై ఒంగోలు వేదికగా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి
ఒంగోలు, (జనస్వరం) : ఒంగోలులో ముఖ్యమంత్రి నిర్వహించే సభకు ఇంటికి ఒకరు చొప్పున ఖచ్చితంగా హాజరు కావాలని ప్రభుత్వ ఉద్యోగులే బెదిరింపులకు దిగుతుండటం వైసీపీ నిరంకుశత్వాన్ని తెలియచేస్తోందని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పేర్కొన్నారు . సీఎమ్ సభకు రాకపోతే పెన్షన్, రేషన్ కార్డు, ఇతర స్కీముల నుంచి వచ్చే లబ్ది తొలగిస్తామని హెచ్చరించడం వైసీపీ ప్రభుత్వ దిగజారుడుతనాన్ని తెలియచేస్తోంది. శ్రీ జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను బతిమాలి, ముద్దులుపెట్టుకొని అధికారంలోకి వచ్చాక తన నిజ స్వరూపాన్ని చూపిస్తున్నారు. పాదయాత్రలోను, ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఇచ్చిన హామీలను గాలికొదిలేసి నవ రత్నాలను కూడా అరకొరగా అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఆయన ఒంగోలులో నిర్వహించే సభకు ఎవరూ హాజరయ్యే పరిస్థితి లేదనే విషయం జిల్లా మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డికి అర్థం అయింది. అందుకే అందరికీ ఫోనులు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. మంత్రి, ఆయన అనుచరులు కడప ఫ్యాక్షనిజాన్నే ప్రకాశం జిల్లాలోను అమలు చేస్తున్నారు.
• పేపర్ మిల్లు పోయే… పోర్టు పోయే
ముఖ్యమంత్రికి దమ్ము ఉంటే ఒంగోలు వేదికగా పెన్షన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు? రేషన్ కార్డులు ఎందుకు తొలగిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అవ్వాతాతలను, దివ్యాంగులను, వితంతువులను మోసం చేస్తూ – వారికిచ్చే పెన్షన్లోనే చెత్త పన్ను మినహాయించుకొంటున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యపు పాలన ఎక్కడా ఉండదు. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు ఇప్పటి వరకూ ఏమి చేసింది? ఏ అభివృద్ధి ప్రాజెక్టును తెచ్చిందో చెప్పాలి? ప్రకాశం జిల్లాకు రావాల్సిన అంతర్జాతీయ స్థాయి పేపర్ మిల్లు శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం తీరుకీ, వాటాల కోసం చేసిన బెదిరింపులకు భయపడి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. రామాయపట్నం పోర్టు ఎటు పోయింది? అసలు ఇక్కడ పోర్టు ఎప్పటికీ వస్తుందో కూడా అర్థం కానీ పరిస్థితి ఉంది. వెలిగొండ ప్రాజెక్టు గురించి ఈ ముఖ్యమంత్రి ప్రకాశం జిల్లా ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు. ప్రభుత్వ తీరుతో జిల్లా రైతాంగం దిక్కు తోచకుండా ఉంది. వరి సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయింది. వైసీపీ ప్రభుత్వం చేతకాని పాలన… అంతులేని అవినీతి మూలంగా – రైతులు, పేదలు, వృద్ధులు, యువకులు, విద్యార్థులు, వ్యాపారులు నుంచి పారిశ్రామికవేత్తలు వరఊ ఇబ్బందులుపడుతూనే ఉన్నారు. ప్రజల్లో అసంతృప్తి ఉంది కాబట్టే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది.