
హైదరాబాద్, (జనస్వరం) : హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు, దోషికి సరైన శిక్ష పడే వరకు పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చిన్నారికి జరిగిన దారుణం తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు. అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది అన్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని బుధవారం సాయంత్రం ఆయన పరామర్శించారు. ఆ బిడ్డ తల్లిదండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “చిన్నారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సభ్య సమాజం మాట్లాడుకోలేని ఘోరమైన సంఘటన ఇది. ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ కనబడకుండా పోతే ఆ తల్లిదండ్రులకు ఏమయ్యిందో అర్థం కాని పరిస్థితి. వినాయక చవితి కావడంతో విగ్రహాల వెంట వెళ్లిందేమోనన్న అనుమానంతో సరూర్ నగర్ ట్యాంక్ బండ్ నుంచి అన్ని ప్రాంతాల్లో వెతికారు. ఒక ఇంటి మీద అనుమానం ఉంది చూడమంటే పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేకపోయారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డకు న్యాయం జరగాలని కోరుకోవాలన్నారు. మంత్రి వర్గంలోని పెద్దలను పంపి బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు ఓదార్పు అవసరమని, ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయగలమో ఆలోచించి చేయాలని కోరారు.
• మీడియా బాధ్యతగా వ్యవహరించాలి
ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం కావడం సమాజానికి అంత మంచిది కాదని ఆయన అన్నారు. మీడియా కొన్ని సంఘటనలపై ఎక్కువగా ప్రచారం చేసి ఇలాంటి వాటిపై స్పందించకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారాల్లో కూడా బాధ్యతగా ఉండాలని, ఏదో ఒక సంఘటనను పట్టుకుని హైలెట్ చేసి వదిలేయకుండా అన్యాయం జరిగినప్పుడు దాన్ని ఎక్కువ మందికి తెలియజేయాల్సిన అవసరం మీడియాపై ఉందన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన బయటకు వచ్చింది. జనసేన వీర మహిళా విభాగం నేతలు, విద్యార్ధి విభాగం నాయకులు సంపత్ నాయక్ లు విషయాన్ని నా దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు నిందితుడు దొరకలేదని, తమకు న్యాయం జరగలేదని చిన్నారి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. బిడ్డ చనిపోయిన బాధలో ఉద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద మనసుతో అర్ధం చేసుకోవాలి” అని ఈ సందర్భంగా పోలీసు అధికారులను విన్నవించారు.