అమరావతి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్‌లో అధ్వాన రోడ్ల పరిస్థితులను ప్రజలు ప్రభుత్వానికి తెలియజేసేలా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పోస్ట్ చేయాలంటూ జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 6.20 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయని వెల్లడించారు. ఈ సమస్యను రెండున్నర కోట్ల మంది ముందుకు తీసుకువెళ్లగలిగామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఫొటోలతో వచ్చిన ఆయా పోస్టులను చూశా. తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద రోడ్లు పైరు వేసుకునేలా ఉన్నాయి. గోకవరం నుంచి గుర్తేడు మార్గంలో గుంతల కారణంగా నడుస్తున్నసమయంలోనే బస్సు వెనుక రెండు చక్రాలు ఊడిపోయాయి. 25 మంది ప్రయాణికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో గజానికో గొయ్యి కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా చీమకర్తిలో ముఖ్యమైన కూడలిలోనూ రహదారులు దారుణంగా ఉన్నాయి. అక్కడ గ్రానైట్ రవాణా వాహనాలు ఎక్కువగా వెళ్తుంటాయి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు రహదారి సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని పవన్ కళ్యాణ్ గారు వివరించారు. అడుగుకో గుంత గజానికో గొయ్యిలా ఉన్న రాష్ట్ర రహదారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. వెంటనే మరమ్మతులు ప్రారంభించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన కోరారు. ఒక్క పిలుపుతో స్పందించిన ప్రజానీకానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.