నెల్లూరు, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వ అడ్డగోలు చెత్త పన్ను దోపిడీపై జనసేన పార్టీ నెల్లూరు సిటీ కార్యాలయంలో నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగాన్ని గుర్తుచేశారు. 2021 జులై 8 వైఎస్ఆర్ జయంతి నుండి సామాజిక పింఛన్లు రూ.2250లు నుండి రూ.2500లు ఇస్తామన్న సంగతి ఇప్పుడేమైందని నిలదీశారు. ఆర్ధికంగా దివాళా తీసిన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేక చెత్త పై కూడా JST (జగన్ శానిటరీ ట్యాక్స్) పన్ను విధిస్తూ దేశంలోనే అభాసుపాలైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందని ఎద్దేవా చేసారు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పింఛన్లు 2500 రూపాయలుగా పెంచి ఇవ్వాల్సింది పోయి అలా పెంచక వారు ఇచ్చే రూ.2250లలో కూడా మూడు నెలల చెత్త పన్ను రూ.180లు కట్ చేసి గుడిసెల్లో నివసించే వృద్ధులకు, వితంతువులకు రూ.2070లు ఇవ్వడం దుర్మార్గమైన దోపిడీ చర్యగా అభివర్ణించారు. నెలకు రూ.3000లు పింఛన్ పొందే వికలాంగులకు కూడా చెత్త పన్ను రూ.180లు కట్ చేసి రూ.2820లు ఇవ్వడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ పన్ను కోతలకు సంబంధించిన ఆధారాలను రశీదులతో సహా కేతంరెడ్డి మీడియా ముందుంచారు. ఇలాంటి అడ్డగోలు దోపిడీలతో పరిపాలన సాగిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయిందని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్రానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారే అని, ఇలాంటి అడ్డగోలు విధానాలు లేకుండా ప్రజారంజక పాలన అందించే సత్తా ఉన్న నిజాయితీ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే అని కేతంరెడ్డి పునరుద్ఘటించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాకు మురళీరెడ్డి, మోష, శ్రీను ముదిరాజ్, జీవన్, జయరాజ్, వెంకట్, ఖాదర్ బాషా, చరణ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.