అమరావతి, (జనస్వరం) : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో వైకాపా ఉత్తుత్తి డ్రామాలాడుతుందని, ఆ పార్టీ ఎంపీలు గాల్లో కత్తులు తిప్పుతున్నారే తప్ప రాజ్యాంగబద్ధ ప్రయత్నాలు చేయడం లేదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తాడేపల్లి నుంచి లేఖలు రాస్తూ ఉన్నారే గానీ, ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ప్రయత్నించడం లేదో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రజలకు వైకాపా ప్రభుత్వం స్లీల్ ప్లాంట్ వ్యవహారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కూసంపూడి శ్రీనివాస్ గారు ఈ ప్రభుత్వాన్ని కోరారు.