నెల్లూరు సిటీ 8వ డివిజన్ రేబాల వారి వీధి గ్రంథాలయం వెనుక సీఆర్పీ డొంక ప్రాంతానికి చెందిన యువకులు శేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి 30 మంది యువకులు చేరడం జరిగింది. వారికి జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న తమతో కలిసి ప్రయాణించడానికి శేఖర్ మరియు వారి మిత్రబృందం ముందుకు రావడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ధ్యేయంగా పని చేయాలన్నారు. నెల్లూరు సిటీలో కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తామన్నారు. మంత్రి పదవి చేపట్టి సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీని అభివృద్ధి పరచాల్సిన అనిల్ కుమార్ యాదవ్ సొంత సంపాదనపైనే దృష్టి పెట్టి ఉన్నారు అని అన్నారు. ప్రతిపక్షాలను, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న వారిని ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తూ ప్రజా హక్కులను కాలరాస్తూ ఇప్పుడు ప్రజా హక్కంటూ మంత్రి అనిల్ తిరగడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి తీసుకోవాల్సిన అర్జీలను మంత్రి అనిల్ తీసుకుంటూ అసలు ఇతను మంత్రా, వాలంటీరా అనే అనుమానాలను కలిగిస్తున్నారన్నారు. వారు ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ మీదే వారికి నమ్మకం లేదని ఈ ప్రజా హక్కుని చూస్తుంటే తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేతగా సీఎం జగన్ తమ ప్రభుత్వం వస్తే మన ప్లేట్ మన బిర్యాని అని అన్నారని, దీంతో వైసీపీ కార్యకర్తలందరూ తమ ప్రభుత్వం వస్తే వారి బిర్యానీ వారికొస్తుందని అనుకున్నారని, కానీ నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం నా ప్లేట్ నా బిర్యాని అంటూ మొత్తం దోపిడీ ఒక్కడిగా చేస్తున్నారని ఆరోపించారు. సర్వేపల్లి కాలువ అంశమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శన అని 30 కోట్ల రూపాయల ఖర్చు కూడా కానటువంటి ఈ రీటైనింగ్ వాల్ కాంట్రాక్టుని 99 కోట్ల 90 లక్షల అంచనాలు వేశారని, 100 కోట్లు దాటితే జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళాలి కనుక ఇక్కడ కూడా అక్రమాలు జరిగాయని అన్నారు. ఈ అంశాలన్నిటి పై తాము హైకోర్టుకి వెళ్తున్నామని, పేదల ఇళ్ళు ఒక్కటి కూడా కూలకుండా మంత్రి అనిల్ చర్యలను ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామన్నారు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మంత్రి అనిల్ కుమార్ అఖిల పక్షం డ్రామాలాడి తనకు కావాల్సిన వారిని పిలిచి టీ బిస్కెట్ల రాజకీయం చేసాడని, అఖిల పక్షం వేయాల్సింది అభివృద్ధికి సంబంధించిన అంశాల చర్చల కోసం కాని అవినీతి ఆరోపణల మీద కాదన్నారు. మంత్రి అనిల్ ఒకవేళ నిజాయితీ పరుడైతే వేయాల్సింది అఖిలపక్షం కాదని తన మీద ఉండే అవినీతి ఆరోపణలపై జుడీషియల్ దర్యాప్తు జరిపించండని హైకోర్టు జడ్జికి లేఖ రాయాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, శ్రీను ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, హేమంత్ రాయల్, వహీద్, బాషా, వెంకటేష్, సిద్ధు, శ్రీనివాస్ రాజా, మొహిద్దీన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.