గుంటూరు నగరం మునిసిపాలిటీ స్థాయి నుంచి నగరపాలక సంస్థగా రూపుదిద్దుకొని మూడో దశాబ్దంలో ఉన్నా కూడా నగరాభివృద్ధిలో మున్సిపాలిటీ స్థాయి దగ్గరే ఆగిపోవటం సిగ్గుచేటని, గుంటూరు నగరం అభివృద్ధి వైపు పయనిస్తుందో? తిరోగమనంగా ప్రయాణిస్తుందో అర్ధం కావటం లేదని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. గత రాత్రి కురిసిన వర్షానికి గుంటూరు నగరం అతలాకుతలం అయిపోయిందని, గంట పాటు పడ్డ వర్షానికే గుంటూరు మహానగరం నీటమునిగింది అంటే నగరంలోని రోడ్లు, సైడ్ కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ ఎంత దుస్థితిలో ఉందో అర్ధం చేసుకోవవచ్చన్నారు. ఆదివారం వర్షానికి నీట మునిగిన ప్రాంతాలను గాదె వెంకటేశ్వరరావు పరిశీలించారు. ప్రధానంగా 17 వ వార్డులోని దర్గామాన్యం ప్రాంతంలో పర్యటించిన గాదె వెంకటేశ్వరరావు అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయారు. అక్కడి రోడ్లు మొత్తం మురుగుతో నిండిపోయి ఉంది. తీవ్రస్థాయిలో దుర్గంధం వ్యాపించడంతో అక్కడ ప్రజలు పడుతున్న నరకయాతన వర్ణనాతీతంగా ఉందని అక్కడి దుస్థితిని అక్కడి నుంచే కమీషనర్ అనురాధ దృష్టికి తీసుకువెళ్లారు. అసలే కరోనా మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉంది, దానికి తోడు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదికన ఇక్కడి సమస్యల్ని పరిష్కరించాలని కమీషనర్ అనురాధని గాదె వెంకటేశ్వరరావు కోరారు. ప్రజల ఎదురుకొంటున్న సమస్యలపై జనసేన నిత్యం పోరాడుతుందని, ప్రజలకు అండగా ఉంటామని గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయనతో పాటు జనసేన పార్టీ అర్బన్ జిల్లా నాయకులు ఆళ్ళ హరి , కొప్పుల కిరణ్ , మిద్దె నాగరాజు , శిఖ బాలు తదితరులు పాల్గొన్నారు.