పశ్చిమగోదావరి జిల్లా, తణుకు నియోజకవర్గం అర్జనుడిపాలెం గ్రామంలో జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులు అనుకుల రమేష్ అధ్యక్షతన అఖిలపక్షం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు, తెలుగుదేశం జిల్లా బిసి సెల్ అధ్యక్షులు కునుకు జనార్ధన్, బియస్పీ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్, జనసేన మహిళా నాయకురాలు కాట్నం విశాలి, కాశీఆకేటి తదితరులు మాట్లాడుతూ ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరిన రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కారుమూరి వేంకట నాగేశ్వరరావు క్షమాపణ చెప్పాలని కోరారు. అలాగే రైతులకు న్యాయం చేయాలంటూ ఇరగవరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులు న్యాయవాది అనుకుల రమేష్, అర్జనుడిపాలెం ప్రెసిడెంట్ పోతుల గంగాధరం మరియు రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తణుకు నియోజకవర్గం లోని మొత్తం రైతుల ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. ఇరగవరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పస్తామని తెలియజేశారు. అక్రమ కేసులు ఉపసంహరించుకోక పోతే మండల కేంద్రంలో ఉద్యమం ఉధృతంగా సాగుతుందని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కావూరి మాధవ రాయుడు, శ్రీను, సత్తి ఎర్ర కృష్ణారెడ్డి, ఓసూరి సుబ్బారావు, ఆరేటి కృష్ణ, చిట్టాల నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.