ఒక్కడై రావడం… ఒక్కడై పోవడం.. నడుమ ఈ నాటకం…
అంటూ చివరికి మోసేది ఆ నలుగురు అన్నాడోకవి.
నలుగురు కాదు కదా ఇప్పుడు ఒక్కడు కూడా రాలేని పరిస్థితి.
ప్రపంచమంతా కరోనా మహమ్మరి తన విశ్వరూపాన్ని చూపిస్తు౦టే ప్రతి ఊరు శవాలతో స్మశానాలు నిండిపోతుంటే ప్రతి ఇల్లు సొంతవాళ్ళను పోగోట్టుకొని శోకసంద్రంలో తేలుతుంటే ఆ బాధ ఆ నరకం పడిన వారికే ఎరుక. వయసుతో సంబంధం లేకుండా, లక్షణాలతో సంబంధం లేకుండా రోజుల తేడాతోనే తనువులు చాలించేవారు కొందరైతే… బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలాన్ని వెళ్ళదీస్తున్నవారు మరికొందరు. ఇదంతా ఎందుకు ఏమిటి ఎలా అని లోతుగా ఒక్కసారి ప్రశ్నించుకుంటే…? మనం ఏదైతే పంచుతామో అదే మనకు తిరిగి వస్తుంది అంటారు. ఇక్కడ కూడా అదే జరిగిందేమో.. మనం ఏ బాధనైతే ప్రకృతికి మిగిల్చామో తిరిగి మనకూ అదే బాధను మిగిలించిందేమో మరి. ప్రకృతి భగవంతుని సృష్టి. ఆ ప్రకృతితో కలసి మనిషిని ఎదగమని పంపిస్తే ఆ మనిషి సంఘ జీవియై తనకున్న బుద్ధి జ్ఞానముతో పాటు రాను రాను దురాశ, అసూయ, ద్వేషం, స్వలాభం మొదలైన దుర్గణాలకు అలవర్చుకున్నాడు. వీటితో ఇతరులను వంచించడంతో భాగంగా ప్రకృతిని కూడా బలిపశువును చేశాడు. ప్రకృతి అంటే పచ్చని చెట్లు, పారే సెలయేర్లు, నల్లని మబ్బులు, మండే నిప్పు, మోసే భూమి, పక్షులు, జంతువులు మాత్రమే కాదు. వాటితోపాటు మనిషి కూడా… మనిషి కూడా ప్రకృతిలో భాగం. అంతేకాని ప్రకృతి మనిషి కోసం కాదు అనే విచక్షణ కోల్పోయి ప్రకృతిని హింసించడం మొదలు పెట్టాడు. విచక్షణా రహితంగా చెట్లను నరికేయడంతో అడవులు గణనీయంగా తగ్గిపోయి గాలిని శుద్ధిచేసే తీరులేకుండా పోయింది. విపరీతమైన ప్లాస్టిక్ ఉపయోగం.. అవసరమున్నా లేకున్నా వస్తువులు కొనడం పారవేయడంతో చెత్త ఉత్పత్తి రేటు గణనీయంగా పెరగడం.
తన మేధాశక్తితో శాస్త్రసంకేత పరిజ్ఞానంతో పరిశ్రమలు నెలకొల్పి అది వెదజల్లే వాయువులతో కోలుకోలేనంతగా గాలి నీరు ఆహారం కలుషితమవ్వడం. వేగవంతమైన జీవనంలో వాహనాలు వాటికోసం ఉపయోగ ఇంధనాలు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నెన్నో.. మానవుని స్వార్థపూరిత ఖాతాలో దీని పర్యవసానమే పర్యావరణ కాలుష్యం భూమి వేడెక్కడం, ఓజోన్ పొర బలహీనతకు గురికావడంలాంటి వాటికి కారణాలవుతున్నాయి. ఎటు చూసినా కాలుష్యం గాలి, నీరు, భూమి, ఆహారం అన్నీ కలుషితమై మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యింది. ఎప్పుడూ మనిషి జీవితం ప్రకృతితో మమేకమై ఉండాలి. అలాంటిది మనిషి ప్రకృతినే ప్రశ్నార్థకం చేయబోతే మాత్రం అది కన్నెర్రచేస్తుంది. దాని పర్యవసానమే దశాబ్ధానికో, శతాబ్ధానికో వచ్చే కరువులు, వరదలు, వైరస్సులూ.. ఈ పనిలో భాగంగా కలియుగంలో కల్కి అవతారంగా ఈ కరోనా వైరస్ పర్యావరణాన్ని పరిక్షించే పనిని చేతబట్టి మనిషి మూతికి బట్ట కట్టించి ఇంట్లో కూర్చొబెట్టింది. ఇంకేముంది ఎక్కడివక్కడ బంద్. రాకపోకలు ఆగిపోయాయి. జనజీవన స్థంభిచిపోయింది. వాహనాలు ఫాక్టరీలు మూతబడ్డాయి. కరోనా వైరస్ ప్రజల జీవితాలకు ఒక దుస్వప్నంగా వెంటాడుతున్నా లాక్ డౌన్ ల వంటివి పర్యవరణానికి వరంగా మారాయి. వాతావరణంలో వేడి తగ్గింది. ఎన్నో నదుల నీళ్ళు స్వచ్ఛంగా మారి గాలిలో కాలుష్యం తగ్గి ప్రకృతిలో చెట్టు పుట్ట పక్షి వన్యప్రాణులు ఆనందంగా సంచరిస్తున్నాయి. విషవాయువులు బాగా తగ్గాయి. అందరూ ఇక్కడ అర్ధం చేసుకోవలసిదేంమంటే మానవాళి ఉనికికి కాలుష్యరహిత పర్యావరణం ఎంతో అవసరం అని గుర్తించాలి. ఇది గుర్తించనంతవరకూ ఇలాంటి ఉపద్రవాలను మానవుడు భరించక తప్పదు. అందుకే కరోనాను అందరూ ఓ గుణపాఠంగా చూడగలిగి ప్రకృతిని ప్రేమించడం తెలుసుకోవాలి.
అందరు బాధ్యతగా మెలగాలి విరివిగా చెట్లు నాటాలి. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ఇంధనం వాడకం తగ్గించి సైకిళ్ళు ఎలెక్ట్రిక్ బైక్ ల వాడకం, విద్యుత్ ను ఆదాచేయడం, నీరును వృధా చేయకుండా ఉండటం, రసాయన రహిత పంటలు పండించాలి. పేపర్ వాడకం తగ్గించాలి. మొదలైన చర్యలతో మనల్ని మనం కాపాడుకుంటూ ప్రకృతితో మమేకమై వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండాలి. అప్పుడే మనం ఇలాంటి ఉపద్రవాల బారిన పడకుండా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచాన్ని వనికిస్తున్న ఈ కరోనా వైరస్ త్వరలోనే అంతమొంది యదావిధిగా మానవుని జీవన పయనం సంతోషంగా సాగిపోవాలని ఆరోజు త్వరలో రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ….
Written By
గీత
ట్విటర్ ఐడి : @Aadhya_2016