జనసైనికుల సాయం మొత్తం ₹.12,000/-లు
ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో మేటి..! జనసైనికులకు లేదెవరూ సాటి…!! అని ఆదిపూడి గ్రామస్థులు ప్రశంసించారు. జనసేనపార్టీ నూతలపాడు మహిళా నాయకురాలు కొలసాని లక్ష్మీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పగడాల లక్ష్మణ్ కు జనసైనికులు సోమవారం రాత్రి ఎనిమిది వేల రూపాయలు నగదు, నాలుగు వేలరూపాయల విలువైన నిత్యావసర సరుకులు సాయం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జనసైనికుల ఔదార్యాన్ని ప్రశంసించారు. వివరాల్లోకి వెళ్తే… రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పర్చూరు నియోజకవర్గ పరిధిలోని కారంచేడు మండలం ఆదిపూడి గ్రామానికి చెందిన జనసైనికుడు పగడాల లక్ష్మణ్ గురించి ఇటీవల తెలుసుకున్న నూతలపాడు సాధారణ గృహిణి, జనసేన నాయకురాలు కొలసాని లక్ష్మీ శ్రీనివాసరావు చలించి వెంటనే తనవంతుగా వెయ్యి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాకుండా రెక్కాడితే గానీ డొక్కాడని సాటి జన సైనికుడు పగడాల లక్ష్మణ్ కి జనసైనికులు అండగా ఉంటామని పేర్కొని, తక్షణం మనవంతుగా ఆర్థికసాయం చేద్దామంటూ వాట్సప్ గ్రూపులలో ఆమె మెసేజ్ ద్వారా పిలుపునిచ్చారు. దీంతో వెంటనే స్పందించిన పలువురు జనసైనికులు, చిన్నారులు తమకు తోచిన రీతిలో సాయం అందజేశారు. ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న జనసైనికులు మొత్తం ₹. 8,000/-లు నగదుతో పాటుగా పగడాల లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను సైతం అందజేసి ఆదుకున్నారు. దీంతో ఆదిపూడి గ్రామస్థులు జనసైనికుల ఔదార్యాన్ని ప్రశంసిస్తూ.. సాయంచేయడంలో మేటి..! జనసైనికులకు లేదెవరూ సాటి…!! అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొలసాని లక్ష్మీ శ్రీనివాసరావులతో పాటు పగడాల లక్ష్మణ్ వాళ్ళ తల్లి తండ్రులు, పగడాల చిట్టిబాబు, పగడాల రాజ్యలక్ష్మి, తమ్ముడు పగడాల వెంకటగోపి, విన్నకోట కోటయ్య, తంగిళ్ళ నాగ చిరంజీవి పలువురు జనసైనికులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు సైతం తమవద్ద ఉన్న కొద్దిపాటి నగదును అందజేసి దాతృత్వాన్ని చాటుకోవడం గమనార్హం.