
ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా జడ్పిటిసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యక్ష దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికీ మాయని మచ్చని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చిలకం మధుసూదన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకం మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ రేగాటి పల్లి గ్రామంలో జెడ్‌పిటిసి ఏజెంట్‌గా కూర్చున్న నా భార్య చిలకం ఛాయాదేవి పై ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రత్యక్ష దాడులకు దిగి మా ఇంటిలోని కారు అద్దాలను ధ్వంసం చేశారని ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్న వైఎస్‌ఆర్సిపి నాయకులకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం పలుకుతారు అన్నారు. రోజురోజుకు ధర్మవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు శృతిమించి పోతున్నాయని అధికారులు సైతం చూసిచూడనట్లు వివరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నారని, తమ కుటుంబం పేద ప్రజల కోసం కోట్లాది రూపాయల విలువ చేసే భూములను దానం చేశామని అలాంటి మాపై వైసీపీ నాయకులు దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ పద్ధతి మానుకోకపోతే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందించి అధికార పార్టీకి తగిన గుణ పాఠం చెబుతామన్నారు. అంతేగాక రేగాటిపల్లి గ్రామంలోని దళితులపై కూడా అధికార పార్టీ నాయకులు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఇలాంటి వారికి త్వరలో ప్రజలే తగిన గుణపాఠం పలుకుతారు అన్నారు.