ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం సింగరపల్లి గ్రామంలో జనసేన కార్యకర్త శ్రీ బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు పాల్పడడం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు అందరిని చాలా బాధించింది. ఆయన కుటుంబానికి జనసేన పార్టీ పూర్తి అండగా నిలబడుతుంది. శ్రీ వెంగయ్య నాయుడు కుటుంబానికి ధైర్యం కలిగించాలని జిల్లా నాయకత్వాన్ని ఇప్పటికే పార్టీ అధ్యక్షుల వారు ఆదేశించారు. ఆ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారు.
సభ్య సమాజం సిగ్గుపడుతుంది :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయి. సింగరపల్లి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, రోడ్లు మరమ్మతులు జరగాలనే సదుద్దేశంతో శ్రీ వెంగయ్య నాయుడు గ్రామస్థులందరిని కలుపుకొని స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నా వెంకట రాంబాబు గారిని ప్రశ్నిస్తే… ఆ యువకుడి గొంతు నొక్కేశారు. ఎమ్మెల్యే రాంబాబు గారు దూషించడమే కాకుండా, ఆయన పర్యటన అనంతరం స్థానిక వైసీపీ నాయకులు, వాలంటీర్లు కూడా అతన్ని, అతని కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేశారు. ఆ పరిణామమే వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు దారి తీసింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడంపై ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి.
ఎల్లప్పుడూ అధికారంలో ఉంటామనుకోవద్దు :
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దౌర్జన్యాలకు పాల్పడింది. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి వేధిస్తోంది. ఇలాంటి చర్యలను జనసేన పార్టీ ఖండిస్తోంది. ఏ పార్టీ కూడా ఎల్లప్పుడూ అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలిస్తున్నారు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. శ్రీ వెంగయ్య నాయుడు వంటి నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు చాలా మంది జనసేనపార్టీలో ఉన్నారు. వారందరికి అండగా జనసేన పార్టీ ఉంటుంది. శ్రీ వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరెవరు ఒత్తిడి తీసుకొచ్చారో వాళ్లపై న్యాయపరంగా పోరాటం చేస్తాం అని నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు.