
ఎన్నికల కోసం కోట్లు ఖర్చు చేస్తారు..జనం కోసం ఒక్క రూపాయి తీయరు – శ్రీ పవన్ కల్యాణ్ గారు…
నాయకులు ఎన్నికల కోసం కోట్లు ఖర్చు చేస్తారుగానీ జనం క్షేమం కోసం అంటే జేబు నుంచి ఒక్క రూపాయి కూడా తియ్యరు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు అన్నారు. మనం కట్టే పన్నులతో వారు జేబులు నింపుకుంటున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో నివర్ తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన శనివారం నెల్లూరు నుంచి బయలుదేరి గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. మార్గమధ్యంలో గూడూరు, తిప్పవరప్పాడుల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “రైతులకు అండగా ఉండేందుకు వచ్చాను. ప్రభుత్వం రైతులకు తక్షణ సాయంపై స్పందించని పక్షంలో ఈ నెల 7వ తేదీన అన్ని నియోజకవర్గాలో రైతులకు అండగా నిలిచేందుకు నిరసన తెలపాలని నిర్ణయించాం. గూడూరు నుంచి తిప్పవరప్పాడు మధ్య రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. రోడ్డు మీద ప్రయాణిస్తున్నట్టు లేదు పడవల్లో వెళ్తున్నట్టుంది. ఆంబులెన్స్ ఎదురొచ్చింది. అందులో ఓ గుండెపోటు వచ్చిన వ్యక్తో, ప్రసవం కోసం వెళ్తున్న మహిళో ఉంటే పరిస్థితి ఏంటి. ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీల్లో తీసుకువస్తారు. ఈ రోడ్ల మీద కూడా పరిస్థితి అలాగే ఉంది. వర్షానికి ముందు రోడ్లు వేస్తారు. రెండు రోజుల్లో కొట్టుకుపోతాయి. ఎక్కడ చూసినా అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. మనం కట్టే పన్నుల సొమ్ము నుంచి వారు సంపాదించుకుంటారు. నాయకుల ఇళ్ల ముందు రోడ్లు ఉంటాయి తప్ప గ్రామాల్లో కనబడవు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న జనసైనికుల మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం” అన్నారు. తిప్పవరప్పాడు గ్రామంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు జనసేన జెండా దిమ్మెను ఆవిష్కరించారు. అంతకుముందు గూడూరు క్లాక్ టవర్ సెంటర్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.వెంకటగిరి నియోజకవర్గంలోని రావి గుంటపల్లి గ్రామంలో ఉన్న కోస్టల్ వేస్ట్ మేనేజ్ మెంట్ డంప్ యార్డ్ వల్ల తమ గ్రామంతోపాటు పరిసర 30 గ్రామాలు కాలుష్యం బారిన పడి జనం రోగాల పాలవుతున్నారు అని భారీ బ్యానర్ తో కూడలిలో నిలిచారు. వారి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “విషతుల్యాల కారణంగా 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీరు, నేల విషతుల్యంగా మారి ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. పశువులు చనిపోతూ ఉన్నాయి అని రావిగుంటపల్లి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జనసేన పార్టీ సిద్దాంతమైన పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి బాధితులకు అండగా ఉంటాం. స్థానిక జనసైనికులు, నాయకులతో మాట్లాడి ప్రభుత్వం కదిలివచ్చేలా పోరాటం చేస్తాం. రైతాంగానికి అండగా ఉండడానికి వచ్చాం. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 35 వేల పరిహారం ఇవ్వాలి. రూ. 10 వేలు తక్షణ సాయం అందించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 70 వేల ఎకరాల పంట నష్టం వాటిల్లింది. మద్యం అమ్మకాల ద్వారా సంపాదించిన డబ్బు రైతులకు పరిహారంగా ఇవ్వవమని కోరుతున్నాం” అన్నారు. నెల్లూరు నుంచి గూడూరు వెళ్తుండగా జాతీయ రహదారిపై పాత వంతెన వద్ద రహదారిపై వరద నీరు పారుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.