
మార్గం మధ్యలో రోడ్డు మీద యువకులను ఆశ్చర్యపరచిన జనసేనాని…
నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నెల్లూరు నుండి వెంకటాచలం చేరుకునే మార్గం మధ్యలో బాలయపల్లి మరియు గొల్లపల్లి గ్రామాలకు చెందిన యువకులతో పవన్ కళ్యాణ్ గారు కాసేపు ముచ్చటించారు. మార్గం మధ్యలో కారు నుండి దిగిన పవన్ కళ్యాణ్ గారు దగ్గరలో ఉన్న కల్వర్టు మీద కూర్చుని యువకులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు.
మీ గ్రామాల్లో రోడ్లు ఎలా ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు అడగగా ఎదో తూ తూ మంత్రంగా వేసిన రోడ్ల గురించి ఏం చెబుతాం అన్న అని యువకులు బదులిచ్చారు.మన ఉమ్మడి శ్రమ తో వచ్చిన డబ్బులు గురించి మన యువతే బలంగా మాట్లాడాలి, ఇవేమీ నాయకుల జేబుల్లో నుండి తీసి ఇస్తున్న డబ్బులు కాదు. మీరు విడి విడిగా ఉండకండి, కలిసి బలంగా మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ గారు కోరారు. అనంతరం మరో యువకుడు మాట్లాడుతూ మేము మీ సినిమాలకు అభిమానులం కాదు అన్న, మిమ్మల్ని రాజకీయంగా అభిమానిస్తాం..మిమ్మల్ని మొదట నేను నమ్మలేదు, నాకు మిమ్మల్ని నమ్మడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. నేను మిమ్మల్ని అభిమానించడం మొదలు పెట్టిన తర్వాత మా ఇంట్లో ప్రతిరోజూ మా నాన్నతో మీ విషయంలో గొడవ పెట్టుకునేవాడినని అన్నాడు. ఇలా జరిగిన కొన్ని రోజులకే మా నాన్న కూడా మీ గురించి అందరితోనూ గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. కనిపించిన వారందరితో జనసేనకు ఓటెయ్యమని చెప్తున్నారు. నువ్వు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నావేంటి నాన్న అని నేను అడగగా నాకు కూడా ఆయన గురించి తెలుసు అన్నారు, అక్కడే మార్పు మొదలయ్యింది అని ఆ యువకుడు పవన్ కళ్యాణ్ గారితో ఆనందంగా, గర్వంగా అన్నాడు. రాజకీయాలు నాకు సరదా కాదు, ఒక్కొక్కరు ఓటుకి 2000 రూపాయలు తీసుకోవడం వల్ల నైతికంగా మనం ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పుస్తకాల్లో ఉండే దానికి, నిజంగా ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. నేను నిన్న మీ దగ్గరకు వచ్చేటప్పుడు నన్ను ఆపేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారు. ఇంతలో యువకుడు మాట్లాడుతూ మీరు మా దగ్గరకు వస్తే వాళ్ళ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని భయం అన్న అన్నాడు.
స్వాతంత్య్రం కోసం ఎంతో మంది వారి జీవితాలను త్యాగం చేసారు, వారి కోసం ఈ దేశం కోసం మనం ఎంతోకంత బాధ్యతగా బతకాలి. అందుకే నేను న సినిమాల్లో దేశ భక్తి గురించి చెప్పేందుకు పాటలు పెట్టేవాడిని. మీరు నా మీద ప్రేమ, అభిమానంతో ఇక్కడ నాతో కూర్చున్నారు అని పవన్ కళ్యాణ్ గారు అనగా..ఒక యువకుడు మీ మీద ప్రేమ కంటే మీ వల్ల సమాజంలో మార్పు వస్తుందని భావించి ఇక్కడకు వచ్చాం అన్న అన్నాడు. నేను ఓడిపోయినా నాకు ఎప్పుడూ భయం కలగదు. కులాలు, మతాలు గురించి నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న వేళ..అబ్దుల్ ఖాదిర్ గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు, వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి అతనిని కల్వర్టు మీద పక్కనే కూర్చోపెట్టుకున్నారు. నా సభ జరిగేటప్పుడు ఎక్కడైనా నమాజు జరిగితే నేను నా సభను కొంతసేపు ఆపేస్తాను. అది నాకు అన్ని మతాల మీద ఉన్న గౌరవం. నాకేదో అద్భుతాలు జరుగుతాయని రాజకీయాల్లోకి రాలేదు, వచ్చే తరాలు కోసం రాజకీయాల్లోకి వచ్చా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చేనేత కార్మికుల మగ్గాలు తడిచిపోయాయ్, ఒకసారి మీరు వచ్చి ఆ కార్మికుల కష్టాలు చూడామని ఒక యువకుడు కోరగా మీరు ముందు ఉండి నన్ను అక్కడకు తీసుకెళ్లండి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎవరైనా మీ మీద దాడులు చేస్తే మీరు ఎలాంటి వారో మేము అలాంటి వాళ్ళమే, మీరు దాడులు చేస్తే భయపడం అని చెప్పండి. ఒక్కరు వస్తే 10 మంది వెళ్ళండి అని పవన్ కళ్యాణ్ గారు యువకులకు ధైర్యం చెప్పారు.