
పోరాడి ఫలితం సాధించిన బీజేపీ – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…
జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక ధృఢ సంకల్పంతో పోరాడి ప్రజల మనసులను గెలుచుకున్న బీజేపీ అధినాయకత్వానికీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా మరో విజయాన్ని అందుకున్న శ్రీ బండి సంజయ్ గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు డాక్టర్ కె. లక్ష్మణ్ గారికి, బీజేపీ కార్యకర్తలకు శుభాభినందనలు.ఈ ఎన్నికలలో బీజేపీ సాధించిన 48 స్థానాలు ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న భావనకు ఒక బలమైన సంకేతం. ఈ ఎన్నికలను బీజేపీ నాయకులు ఆషామాషీగా భావించలేదు. ఎన్నికల కోసం కార్యకర్తలను సమాయత్తం చేయడంలోనూ, గెలుపునకు వ్యూహ రచనలో బీజేపీ రాష్ట్ర నాయకులు చూపిన చొరవ, తెగువ ఆ పార్టీని విజయపదాన నడిపించాయి. ఇంటింటికీ తిరిగి శ్రమకోర్చి చేసిన ప్రచారం ఈ రోజున ఫలితాన్నిచ్చింది. బీజేపీ విజయానికి జనసైనికుల కృషి కూడా తోడవడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. బీజేపీ అగ్రనాయకుల ఎన్నికల ప్రదర్శనలో జనసైనికులు అగ్రభాగాన నిలిచి కదంతొక్కడం వారి చిత్తశుద్దికి నిదర్శనం. 60 స్థానాల్లో పోటీకి సిద్ధమైన జనసైనికులు బీజేపీ కోసం పోటీ నుంచి విరమించుకోవాలని కోరినప్పుడు వారి భవిష్యత్తును సైతం పక్కన పెట్టి బీజేపీ ప్రచారంలో మమేకమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసాగా ఉంటానని నిండైన మనసుతో హామీ ఇస్తున్నాను.
ప్రజల తీర్పు ఎంతో విలువైనదిగా భావిస్తూ ప్రజాభీష్టానికి అనుగుణంగా తెలంగాణలోనూ, గ్రేటర్ హైదరాబాద్ లోనూ ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తనదైన బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని ఫోను ద్వారా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి తమ ఆనందాన్ని పంచుకోవడం ముదావహం. ఈ సందర్భంగా జనసేన పార్టీకి, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది. బీజేపీతో భవిష్యత్తులో పరస్పర సహకారంతో కలిసి తెలంగాణలో కూడా పని చేస్తామని స్పష్టం చేస్తున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ నా తరఫున, జనసేన పార్టీ శ్రేణుల తరఫున అభినందనలు తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.