Search
Close this search box.
Search
Close this search box.

ఒక్క ఛాన్స్ ఇవ్వమంటారు… ఇచ్చాక మీ కోసం నిలబడరు – శ్రీ పవన్ కల్యాణ్ గారు…

ఒక్క ఛాన్స్ ఇవ్వమంటారు… ఇచ్చాక మీ కోసం నిలబడరు – శ్రీ పవన్ కల్యాణ్ గారు...

               దళితులు… నిమ్న కులాలను కాపాడుకొనేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకువచ్చారు… ఆ చట్టాన్ని ఎస్సీలపైనే ప్రయోగించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమంటారు గానీ మీ కోసం నిలబడాలన్న ఆలోచన మాత్రం ఉండదని చెప్పారు. దళితుల పై   దళితులతోనే అట్రాసిటీ కేసులు పెట్టించే స్థితికి వైసీపీ ప్రభుత్వం వచ్చిందన్నారు. గురువారం రాత్రి తిరుపతిలో చిత్తూరు, కడప జిల్లాల జనసేన నాయకులతో శ్రీ పవన్ కల్యాణ్ గారు సమావేశం నిర్వహించారు. నాయకులు తమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న తుఫాన్ నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ రైతాంగం కోసం, కౌలు రైతులకు అండనిచ్చేందుకు  దివంగత లాల్ బహదూర్ శాస్త్రి గారి స్ఫూర్తితో జై కిసాన్ పేరుతో ఓ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం చేపడుతున్నాం. సైనికుడు, రైతు లేకపోతే దేశం లేదన్నారు. ఇద్దరికీ అండగా నిలబడాలన్న తపన నాలో ఉంది. సైనిక్ బోర్డుకి నా వంతు సాయం చేశా.  రైతు క్షేమంగా ఉండాలన్న లక్ష్యంతో పార్టీ తరఫున మూడు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాములకు శ్రీకారం   చుడుతున్నాం. రైతు కన్నీరు పెట్టకూడదు. గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర కావాలి. రైతు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మట్టి నుంచి సుగంధ పరిమళాలు తీసే వాడు రైతు. ఆ రైతు కష్టం తెలియాలంటే ప్రతి ఒక్క విద్యార్ధి ఒక మొక్క వేసి దాన్ని పండించి చూడండి. పండిన పంట పోయిన రైతు తాలూకు బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇంతటి కార్యక్రమాన్ని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లడానికి కారణం ఉంది. రైతు కోసం నిలబడేప్పుడు ఎవరో చెబితేనో అడ్డుకుంటేనో ఆగను. రాజధాని రైతుల వ్యవహారంలోగానీ, టమాటా రైతుల కోసం నిలబడేప్పుడుగానీ లాఠీలు విరిగినా వెనుదిరగను.

ఒక్క రైతు ఆత్మహత్యను ఆపినా నా ప్రయత్నం సఫలమే 

            ప్రస్తుతం వరుస వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులు తీవ్రమైన నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. వారికి భరోసా ఇచ్చేందుకే వచ్చాం. వారికి నావంతు బాధ్యతగా ధైర్యం చెప్పేందుకు వచ్చాను. నేను రావడం వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నుంచి ఒక్క రైతు ఆగినా నా ప్రయత్నం సఫలమైనట్టే. తుఫాను కారణంగా 17 లక్షల పై చిలుకు ఎకరాలకు నష్టం వాటిల్లింది. వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ బాధ్యతతో కూడిన పాలనా వ్యవస్థ అవసరం ఉంది. అందుకే రాష్ట్రం బాగుండాలన్న ఉద్దేశంతో బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చాం. అందుకే బాధ్యతగా ఉండాలి అనుకున్నాం. నేను పార్టీ పెట్టింది పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అని ఎప్పుడూ చెప్పలేదు. అది కొంత మంది నన్ను వాడుకోవడానికి సృష్టించారు. ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఒక భాగం మాత్రమే. నా ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు, చట్టం నుంచి మద్దతు లభించనప్పుడు నేను రోడ్డు మీదకు వస్తాను. ప్రతి ఒక్కరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యతను తీసుకోవాలి పారిపోకూడదు.

బెదిరించే వారికి బలంగా సమాధానం చెప్పాలి

           రాయలసీమలో అధికార పార్టీ వారు దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు అంటున్నారు. అలా అని భయపడే వాళ్లు భయపడండి. నేను మాత్రం భయపడను. కొడితే ఎదురు తిరుగుతా? అలా అని కేవలం కోపం ఉంటే చాలదు. ఆలోచన కావాలి. ఆలోచిస్తేనే జ్ఞానం వస్తుంది. నేను శ్రీ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ఫాలో అవుతాను. జి.డి.నెల్లూరు పార్టీ నాయకుడు శ్రీ పొన్న యుగంధర్ దాన్ని ఆచరించి చూపారు. నాయకులు అంటే వారేమీ ప్రత్యేకంగా పుట్టరు. పార్టీ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని బలంగా విశ్వసించే శ్రీ యుగంధర్ లాంటి వాళ్లు తమను బెదిరించే వారికి తాటతీసేయగలరు.  

క్యాబినెట్ ర్యాంకును కవచ కుండలాలుగా వేసుకొని పుట్టలేదు 

              మంత్రి వర్గంలో ఉన్నవారు కర్ణుడిలా సహజ కవచకుండలాలతో ఏమీ పుట్టలేదు. వారిలో ఎందరు శ్రీ చిరంజీవి గారిని కలిసేందుకు ఎలా వచ్చారో నాకు తెలుసు. అలాంటివాళ్లు ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆశయ బలం ఉన్న వారికి ఓటమి భయాలు ఉండవు. ప్రయాణాలే ఉంటాయి. అధికారం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అధికారం బాధ్యతతో కూడిన బరువు. ఏ మాత్రం కృతజ్ఞత చూపని వ్యక్తుల కోసం పని చేయాలి. నాయకత్వం అంటే బాధ్యత తీసుకోవాలి. వాళ్లు ఎందుకు చేయలేదు. వీళ్లు ఎందుకు చేయలేదు కాదు. వారు చేసేలా నాయకులే నడిపించాలి. చదువుకున్న వారిలో కూడా కొందరు సైతం అడ్డదారులు తొక్కుతున్న వ్యవస్థకు మద్దతుగా నిలబడడం బాధ కలిగించింది. నన్ను నేను అన్యాయం జరిగినప్పుడు నిలబడే వ్యక్తిగా బయటికి వస్తున్నాను. ఏ మూలకి వెళ్లినా వేలాది మంది జనం వస్తున్నారు. జనం ఓట్లు ఎందుకు వేయలేదు అన్న కోపం నాకు రాదు. ప్రేమ, అభిమానం ఉంది కానీ దాన్ని ఛానలైజ్ చేయాలి. అలా చేయాలి అంటే ముందు నిలబడాలి. అధికారం అంటే మార్పు తీసుకురావడానికి అదొక సాధనం. పవిత్రమైన బాధ్యత. అంతేగానీ సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకోవడానికో, ఇసుక కాజేయడానికో, మైనింగ్ మాఫియాలు చేయడానికో కాదు. అదే కావాలంటే కాంట్రాక్టర్ అయితే సరిపోతుంది.

అలాంటివారు మన తలరాతల్ని రాస్తున్నారు 

             ముఖ్యమంత్రి అయిపోతే జీవితం మారిపోతుందని రాజకీయాల్లోకి  రాలేదు. కష్టపడే సగటు మధ్యతరగతి మనిషి నుంచి రక్షణ కరువైన ఆడపడుచుల వరకు సమాజంలో ఉన్న నిస్సహాయ వర్గాలకు అండగా ఉండడానికి వచ్చాను. ఎంతసేపూ సమాజం నుంచి ఏమి తీసుకోవాలి అన్న ఆలోచనపోవాలి. ఒక చెట్టు కూడా మనకి ఫలసాయం ఇస్తుంది తప్ప తీసుకోదు. ప్రజా ధనాన్ని దోచేసేవారు ప్రజా ప్రతినిధులయ్యి మన తలరాతల్ని రాస్తున్నారు. ఉన్నతమైన చదువులు చదువుకున్న వారిని శాసిస్తున్నారు. చిరంజీవి గారి లాంటి బలమైన వ్యక్తి పార్టీ పెడితే ఇదే తిరుపతిలో సభకి 10 లక్షల మంది వచ్చారు. అంతటి అఖండ ప్రజాధరణ ఉన్న వ్యక్తిని కూడా మనం నిలబెట్టుకోలేకపోయాం. ఆయన గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ కి బలమైన ముఖ్యమంత్రిని చూసేవాళ్లం” అన్నారు.

రైతుల పరామర్శకు కరోనా అడ్డొస్తుందా?:శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 

                   పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల నాయకులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు… వారు చెప్పిన మాటలు, రైతుల పడుతున్న బాధలు తెలుసుకొని క్షేత్రస్థాయి పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా మహమ్మారిని కూడా లెక్కచేయకుండా రైతులలో భరోసా నింపడానికి ఇవాళ నాలుగు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. వైసీపీ నాయకులకు పుట్టిన రోజులు చేసుకోవడానికి కరోనా అడ్డురాదు. కానీ… రైతులను పరామర్శించడానికి అడ్డొస్తుంది. తక్షణ సాయంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 10 వేలు ఇవ్వాలని అధ్యక్షుల వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతుల తరపున నిలబడి పోరాటం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. నిజాయతీతో, సుదీర్ఘ ప్రయాణానికి కట్టుబడి ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో వారి కోసమే క్రియశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వారికి పార్టీ తరపున ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వాళ్లు ఒక్కొక్కరు వందమందిని మార్చేలా తయారు చేస్తాం. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తకు రూ. 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వలేదు. జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా పాలసీ తీసుకొచ్చింది” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way