అనంతపురం రూరల్, నవంబర్ 27, జనస్వరం : కందుకూరు గ్రామ పంచాయితీలో మంగళవారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయితీ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను దాని నిర్మాణానికి పాటుపడిన మహోన్నత వ్యక్తులు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క బృందాన్ని స్మరించారు. ప్రభుత్వం అనేది శరీరమైతే రాజ్యాంగం ఆత్మ లాంటిదని ప్రభుత్వాలకు దిశా నిర్దేశాలు చూపించేది రాజ్యాంగం అని వివరించారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఒక సంక్లిష్టమైన రాజ్యాంగం అని దీన్ని నిర్మించడానికి ఎంతో కృషి చేశారని తెలియపరిచారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదింపబడి, 1950 జనవరి 26న అమలులోకి వచ్చిన తర్వాత భారత అభివృద్ధికి ఒక దిశ, బాట, ప్రణాళిక ఏర్పడిందని తెలిపారు. భారత రాజ్యాంగ రచనకు 35 నెలలు, 18 రోజులు పట్టిందని, ఈ రాజ్యాంగం ఫలితంగా ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ హక్కు లభించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.