రాజంపేట, ఏప్రిల్ 05 (జనస్వరం) : టిడిపి, జనసేన, బిజెపి కూటమి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని, రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా జనసైనికులు తమ సత్తా ఏంటో చూపాలని జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలకు సూచించారు. శుక్రవారం మన్నూరులోని యల్లమ్మ ఆలయం సమీపంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో కలిసి అతికారి దినేష్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం తన అనుచరులతో కలిసి జనసేన కార్యాలయంలో దినేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పొత్తులో భాగంగా అనూహ్య పరిణామాలతో రాజంపేట అసెంబ్లీ స్థానం తనకు లభించిందని, జనసేన నాయకుల సంపూర్ణ సహకారం తనకు కావాలని సుగవాసి కోరగా జనసేన నాయకులను ఉద్దేశించి అతికారి దినేష్ మాట్లాడుతూ పొత్తు ధర్మాన్ని పాటించి ప్రతి జన సైనికుడు కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. టిడిపి అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం గెలుపు జనసేన గెలుపుగా భావించాలని, అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా అంకితభావంతో పనిచేసే సుగవాసిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. మదనపల్లికి తరలిపోయిన వైద్య కళాశాల తిరిగి రాజంపేటకు రావాలన్నా, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం కావాలన్నా, భ్రష్టు పట్టిన రాజంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలన్నా సుగవాసిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించి ప్రజాస్వామ్య రాజ్యం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన, బీజేపీ, టిడిపి నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలని, ఈ ఎన్నికలను మరో కురుక్షేత్ర యుద్ధంగా భావించి దుర్యోధన పాలనను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సుగవాసి సుబ్రహ్మణ్యంను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.