ఓ సారూ..! మమ్మల్ని జర పట్టించుకోండి.
వరంగల్ ( జనస్వరం ) : వరంగల్ అర్బన్ LVR NAGAR కాలనీలో గత 15సంవత్సరాల నుండి 200 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇంటి పన్ను కూడా మంజూరు అయింది. అందరు ఇంటి పన్ను కూడా క్రమం తప్పకుండా కడుతున్నారు. కానీ ఈ కాలనీలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. కరెంట్ మీటర్లు, మంచి నీటి నల్లాలు, రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ ఎలాంటి సౌకర్యాలు లేవు, ఇప్పుడు ఆ కాలనీకి బాగా వేధిస్తున్న సమస్య ఏమిటంటే, ఇప్పటికీ మంచినీటి సౌకర్యం లేదు. అప్పుడప్పుడూ కాలనీకి తాగునీటి వాటర్ ట్యాంకులు వచ్చేవి. కానీ, ఇప్పుడు వారం రోజుల నుండి ఆ కాలనీకి వాటర్ ట్యాంకర్లు రావడం లేదు. ఈ కరోనా విపత్కర సమయంలో ప్రజలకు త్రాగడానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఉండడంతో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వాటర్ సప్లై అయ్యే ఏరియా చార్లబౌలీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏఈ లేడు అని, సదరు అధికారులు చెప్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు అందజేసినా ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని తగిన సౌకర్యాలు కల్పించాలని LVR NAGAR జనసైనికులు కోరుతున్నారు.