పుట్టపర్తి ( జనస్వరం ) : ప్రపంచానికి ఆధ్యాత్మికతతో పాటు మానవసేవా మార్గాన్ని బోధిస్తున్న ప్రశాంతినిలయాన్ని దర్శించడం తనకెంతో స్ఫూర్తినిస్తుందని బాబా భక్తురాలు ఎస్. అమ్మోజీ బమ్మిడి అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) మాధవరెడ్డిని పుట్టపర్తి లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రముఖ కవయిత్రి, కాలమిస్ట్, సామాజిక కార్యకర్త ఎస్. అమ్మోజీ బమ్మిడి కలిశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్టా గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న అమ్మోజీ సత్యసాయి బాబాకు పరమ భక్తురాలు. బాబా దర్శనార్థం తరచూ పుట్టపర్తికి వస్తుంటారు. శివరాత్రి సందర్భంగా రైలు మార్గంలో ప్రశాంతినిలయానికి చేరుకుని బాబా సమాధిని దర్శించుకున్నారు. విదేశీభక్తులతో కలిసి ప్రత్యేకపూజలు కూడా నిర్వహించారు. రష్యాకు చెందిన బాబా భక్తుడొకరు ఈ సందర్భంగా అమ్మూకు శివపార్వతుల ప్రతిమను జ్ఞాపికగా బహుకరించారు. పుట్టపర్తిలో ఆమె మర్యాదపూర్వకంగా ఎస్పీ మాధవరెడ్డిని కలిసి మాట్లాడారు. అనంతరం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అమ్మూ ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. దైనందిన జీవితంలో వెన్నంటి వుండి తనను బాబా నడిపిస్తున్నాడని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. తాను చేసే పనులన్నింటిలో మంచి చెడుల విచక్షణను స్వామి నిరంతరం కలిగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సాహిత్యం, సమాజసేవా రంగాల్లో బాబా ఆశీస్సులతోనే తాను ముందుకు సాగుతున్నట్లు అమ్మూ పేర్కొన్నారు. ప్రశాంతినిలయం సందర్శించగానే కొత్తశక్తి తనను ఆవహిస్తుందని తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయడం సత్యసాయి ప్రసంగాల స్ఫూర్తితో అలవరచుకున్నట్లు చెప్పారు.