నెల్లిమర్ల ( జనస్వరం ) : నియోజకవర్గంలోని భోగాపురం మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కాకర్లపూడి శ్రీనివాసరాజు గారు ఈరోజు అధికారంగా వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే శ్రీనివాసరాజుతో పాటు అతని అనుచర వర్గం అయిన 40 మంది నాయకులు పార్టీని వీడారు. వైయస్సార్సీపి పార్టీని వీడిన కాకర్లపూడి శ్రీనివాసరాజు గారిని నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి అభ్యర్థి అయిన లోకం మాధవి గారు అయన నివాసంలో కలిసి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన శ్రీనివాస రాజు గారు అతి త్వరలోనే జనసేన పార్టీలోకి జాయిన్ అవుతానని లోకం మాధవి గారికి తెలిపారు. రాజీనామాలు చేసిన శ్రీనివాస్ రాజు గారి అనుచరవర్గమైన 40 మంది ముఖ్య నేతలు లోకం మాధవి గారి ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మాధవి గారు కండువాలు కప్పి వీరిని సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు మాట్లాడుతూ పార్టీలో ప్రథమం నుండి పార్టీ అభివృద్ధి కోసం కృషిచేసిన ఎటువంటి గౌరవం లభించకపోగా, నెల్లిమర్ల నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి పార్టీ అభివృద్ధిని కుంటున పడేసిందని, నియోజకవర్గంలో అభివృద్ధికి కట్టుబడి శ్రమించే వ్యక్తి శ్రీమతి లోకం మాధవి గారని తెలిపారు. లోకం మాధవి గారు మాట్లాడుతూ వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలోకి రావడం ఎంతో సంతోషకరమని నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ కలిసి కృషి చేద్దామని, మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి అని మాధవి గారు ప్రజలను కోరారు.