మంత్రాలయం మఠానికి చెందిన భూముల బహిరంగ వేలం, ఆస్తుల అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం : పవన్ కళ్యాణ్
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి సంబంధించిన 208 ఎకరాల భూమిని వేలం ద్వారా విక్రయించాలనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. దేవాదాయ శాఖకు చెందిన భూములకు ప్రభుత్వం కేవలం ట్రస్టీగా మాత్రమే వ్యవహరిస్తూ ఆస్తులను సంరక్షించాలి తప్ప అమ్ముకోవడానికి వీలు లేదు. దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు కూడా ఉంది. ప్రజల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వికయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మే 25వ తేదీన టీటీడీ ఆస్తుల విక్రయాన్ని నిలుపుదల చేస్తూ జి.ఓ. 888ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిలుపుదల ఉత్తర్వులనే రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, మఠాల ఆస్తులకు వర్తింపచేయాలి.(ధర్మ పరిరక్షణకు ఉద్దేశించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ – పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గితేనే ఇలాంటి వేలం, విక్రయం ప్రకటనలు వస్తాయి. దాతలు ఇచ్చిన ఆస్తులను నడి బజారులో అమ్మకానికిపెడితే… మనోభావాలు దెబ్బతిన్న భక్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దాతలు ఏ లక్ష్యంతో అయితే భూములు ఇచ్చారో దానికి మాత్రమే వినియోగించాలి. దేవాలయ ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన పాలకులు తామే యజమానులం అనుకోవద్దు అని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు.