కడప ( జనస్వరం ) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బలిజల పట్ల సామాజిక న్యాయం పాటించాలని, బలిజల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కాపునాడు రాష్ట్ర నేత హరి రామ జోగయ్య కు కడప జిల్లా కాపు నాయకులు విన్నవించారు. గురువారం ఆయన నివాసంలో కలిసిన కడప జిల్లా నాయకులు జిల్లాలో టికెట్ల కేటాయింపు, సామాజిక సమీకరణాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లాలో అధిక సంఖ్యలో కాపులు ఉన్నప్పటికీ మాత్రం వారి రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం చాలా తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికల్లో బలిజలను ఓట్ల కోసం వాడుకోవడం తప్పితే సీట్లు ఇవ్వడంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు అన్యాయంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో కడప, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు తదితర నియోజకవర్గాల్లో బలిజల ఓట్లు అత్యధికంగా ఉన్నాయని, కానీ ఇక్కడ మాత్రం బలిజలకు పోటీ చేసే అవకాశం రావడం లేదన్నారు. ఇప్పుడు జరుగుతున్న సామాజిక అన్యాయానికి జనసేన ద్వారా అయినా న్యాయం చేకూర్చాలని, ఆ విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని హరిరామజోగయ్యను కోరారు. ఈ సందర్బంగా అయన తప్పక తమ డిమాండ్ ను పవన్ దృష్టికి తీసుకెళ్తానని, తప్పక సామాజిక న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడేకుల వెంకటరమణ, కాపు సంక్షేమ జిల్లా అధ్యక్షులు మాలే శివ, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డిపల్లి మహేష్ బాబు, నగర యువజన అధ్యక్షుడు గ్రంధా వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.