ఏలూరు ( జనస్వరం ) : వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, వచ్చే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటుతో వైసీపీకి బుధ్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రెడ్డి అప్పల నాయుడు ధ్వజమెత్తారు.. ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా బుధవారం 32 వ డివిజన్లోని ఫైర్ స్టేషన్, అమీనా పేటలో ఆయన పర్యటించారు.. స్థానిక నాయకులు జగపతి మనోహరం స్వామి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రజలు వచ్చి భారీ గజమాలతో రెడ్డి అప్పల నాయుడు గారికి ఘన స్వాగతం పలికారు..ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈ నాలుగున్నరేళ్ళ వైసీపీ పాలనలో ఏలూరు నియోజకవర్గం అభివృద్ధిలో కుంటుపడిందన్నారు.. ఏలూరు జిల్లాలోని దెందులూరులో వైసిపి ప్రభుత్వం పులివెందుల ఫ్యాక్షన్ నీ అమలుచేస్తున్నారని మండిపడ్డారు.. వాళ్ళు ఇష్టానుసారంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, పులివెందుల ఫ్యాక్షన్ నీ ఇక్కడ అమలు చేస్తే చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా హెచ్చరిస్తున్నామన్నారు.. మీరు చేస్తున్న దుర్మార్గపు సంస్కృతి వ్యవస్థను వీడాలని, సరైన మార్గంలో నడిపించాలని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు దండుకునే ప్రక్రియను మానుకోవాలని, ఇది మరలా పునరవృతమైతే మీకు తగిన రీతిలో సమాధానం చెబుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏలూరు ఎమ్మెల్యే మాటలే తప్ప చేతలకు పనికిరాడని ఏలూరులో రహదారులను బాగు చేయలేని చేతకాని ఎమ్మెల్యేగా ఆళ్ళనాని మిగిలిపోయారని ఎద్దేవా చేశారు.. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి విజయంతో దేదీప్యమానంగా వెలగడం ఖాయమని అన్నారు..ప్రజాసంక్షేమ పాలన రాగానే ఏలూరు నియోజకవర్గాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు..ప్రజలకు అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ జనసేన అండగా నిలుస్తుందని, భవిష్యత్తులోనూ ప్రజలకు అండగా నిలిచేది జనసేన ప్రభుత్వమే అని తెలిపారు.. అమీనాపేట ఏరియా లో మంచినీటి సరఫరా లేదు.. మురుగు నీరు వ్యవస్థ కూడా సరిగా లేదని, ఎక్కడికక్కడ మురుగునీరు మగ్గిపోయి అనారోగ్యపు స్థితిలోకి నెట్టబడిందని స్థానిక ప్రజలు వారి ఆవేదనను మాకు తెలియజేస్తుంటే మాకే బాధగా ఉందని, జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే చక్కని వ్యవస్థను తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.