అనంతపురం ( జనస్వరం ) : శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్, ప్రపంచ తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ విద్య, సాహిత్య, సామాజిక సేవారంగాల్లో నిత్య కృషీవలుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం డా. ప్రతాప్ జన్మదిన వేడుకలు పలుచోట్ల ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏపీ సాహిత్య అకాడమీ విశిష్ట అవార్డు గ్రహీత డా. పతికి రమేష్ నారాయణ, బిసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది సాకే నరేష్, సాయి ట్రస్ట్ అధ్యక్షుడు విజయసాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సేవలకు గుర్తింపుగా 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ సభ్యుడిగా ఎంపికయ్యారని చెప్పారు. ఐ.ఎస్.ఓ గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ గా విశేష సేవలందిస్తున్నారని చెప్పారు. శ్రీమతి కన్నమ్మ, ప్రభాకరరావ్ దంపతులకు 1979 జనవరి 21న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో జన్మించాడన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ బోయి భీమన్న జీవితసాఫల్య పురస్కారం 2022, మహాకవి గుర్రం జాషువా పురస్కారం 2017లో అందుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం -2016 లో లభించిందన్నారు. వివిధ దేశాలు పర్యటించి అనేక సాహిత్య సంస్థలనుండి బిరుదులూ, సత్కారాలు పొందారని చెప్పారు. శ్రీశ్రీ కళావేదిక చైర్మెన్ గా కవులను ప్రోత్సాహిస్తూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా జాతీయ శత కవి సమ్మేళనాలు నిర్వహించిన ఘనత ప్రతాప్ కే దక్కుతుందన్నారు. పలు జాతీయ స్థాయి అవార్డులు ఆయన సొంతమయ్యాయన్నారు.